తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మేడారం జాతర రేపటి నుంచి నాలుగు రోజులపాటు జరుగుతున్న క్రమంలో ఇప్పటికే లక్షలాదిమంది భక్తులు మేడారం చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మేడారం జాతరకు సంబంధించి ఏర్పాట్లను అనునిత్యం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్నారు. మేడారం జాతర నేపథ్యంలో జాతర ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున ఇప్పటికే 110 కోట్ల రూపాయలను కేటాయించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని మేడారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భావించిన మంత్రి సీతక్క, మేడారంలోనే ఉండి ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి మేడారం జాతర చాలా బాగా జరుగుతుందని ప్రజల నుండి స్పందన వస్తోందంటే సీతక్క జాతర కోసం ఎంతగా కష్టపడ్డారు అనేది అర్థం చేసుకోవచ్చు. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు గద్దెల పైకి వెళ్లి అమ్మవార్లను దగ్గరగా దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గద్దెల పైకి వెళ్లడానికి వీలు లేకుండా తాళం వేసే వారని, అమ్మవారికి మొక్కులు, బంగారం గద్దెలపైకి విసిరి వెళ్ళవలసి వచ్చేదని, కానీ ఈసారి అందుకు భిన్నంగా సామాన్య భక్తులకు కూడా అమ్మవారి దర్శనం సునాయాసంగా దొరుకుతుందని చెబుతున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో, మేడారం జాతరకు మహిళలంతా సంతోషంగా రాగలుగుతున్నారు అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరకు వచ్చే క్రమంలో రోడ్ల పనులు కూడా పూర్తిచేసి, ఎక్కడా రవాణా ఇబ్బంది లేకుండా చూశారని, ట్రాఫిక్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారని , ఈ జాతర తమ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని భక్తులు చెబుతున్నారు. మంత్రి సీతక్క చొరవను కొనియాడుతున్నారు. ఆదివాసి బిడ్డ అయిన సీతక్క వనదేవతలకు చేస్తున్న సేవ గొప్పదని, అమ్మల జాతర కోసం నిద్రాహారాలు మాని సీతక్క చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడుతున్నారు.
6000 ప్రత్యేక బస్సులు
అయితే ఈ మహా జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాయి.కాగా రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను నడపుతోంది. అయితే జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు నడుపుతున్నందున రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అన్నారు. జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్ చేసింది. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరింది.అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మేడారం జాతరకు సమాంతరంగా 24 చోట్ల సమ్మక్క-సారలమ్మ మినీ జాతరలకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామం, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోలివాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ గ్రామం, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చిల్వ కుదూర్ గ్రామాల్లో జరిగే జాతరలకు భక్తులు భారీగా తరలివస్తారు.ఈ జిల్లాల కలెక్టర్లు ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సురక్షితమైన తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య పనులు చేపట్టనున్నారు. ఈ ఆలయాల వద్ద వృద్ధులు, వికలాంగులు, గర్భిణుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయి. ఆయా ఆలయాల చుట్టూ సీసీ రోడ్లు వేయడం, లైటింగ్ ఏర్పాట్లు చేయడం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ స్థలాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.