ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు పార్టీ అభ్యర్దుల ఖరారు పై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిగా ఈ మూడు పార్టీలు పోటీ చేయటం దాదాపు ఖరారైంది. ఈ సమయంలోనే రాజధాని అమరావతి అంశం పైన మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అనైతిక పొత్తులు !
పవన్ పొత్తుల గురించి అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌వి అనైతికమైన పొత్తులు అని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తుందో చెప్పాలని రాంబాబు డిమాండ్ చేసారు. నర్సరావుపేట ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరి చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. ఇదే సమయంలో రాజధాని అంశం పైనా రాంబాబు స్పందించారు. అసలు ఏపీకి రాజధాని లేదని చేస్తున్న వ్యాఖ్యలను ఖండిరచారు. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అమరావతి తాము ఎక్కడికి తరలించలేదని, ఎపికి రాజదానిగా ఇప్పటికీ కొనసాగుతున్నదని చెప్పారు. రాజదానిపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అప్పటి వరకు రాజధానిగా అమరావతి కొనసాగుతుందని వివరించారు. అంబటి రాంబాబు ఈ సారి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం నర్సరావు పేట వైసీపీ ఎంపీగా మాజీ మంత్రి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన భారీ ర్యాలీతో నర్సరావుపేట చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇప్పుడు పల్నాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సమయంలో అంబటి రాజధాని అమరావతి పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయం గా చర్చకు కారణమైంది.