లివింగ్ రిలేషన్ షిప్ కాస్త.. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనుంది.. ఇదేదో ప్రేమికుల జంట గురించో, నిజంగానే పెళ్లి చేసుకుంటున్న జంట గురించో అనుకుంటే.. చెవిలో పువ్వు పెట్టుకుని పింక్ కారు కింద పడ్డట్టే..! మరి ప్రేమికుల గురించి కాదు.. పెళ్లి గురించి కాదు.. ఇంక దేని గురించి అనే కదా. ప్రస్తుతం.. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటున్నాయన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ వార్తలను బీఆర్‌ఎస్ నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నా.. బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. దీంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు ఖాయమంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
రిలేషన్ షిప్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ సెటైర్లు
ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీల కామన్ ప్రత్యర్థి కాంగ్రెస్.. ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. గతంలోనూ.. ఈ రెండు పార్టీలు రహస్య మిత్రులంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. ఇప్పుడు తెరపైకి పొత్తు వార్తలు రావటంతో.. దీనిపై వ్యంగ్యంగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ. గతంలో.. ప్రేమికులిద్దరూ.. లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నారంటూ సెటైర్లు వేసిన కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెళ్లి కార్డు కూడా తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. కాగా.. ఇప్పుడు ఆ రెండు పార్టీల లివింగ్ రిలేషన్ షిప్ కాస్త పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లోనే వ్యంగ్యంగా ట్వీట్ చేసింది కాంగ్రెస్. అయితే.. ఈ ట్వీట్‌తో పాటు.. కేసీఆర్, మోదీ ఫొటోలు పక్క పక్కన పెట్టి.. ‘ప్రేమతో రా’ సినిమాలోని ‘‘ఏమైందో ఏమో.. నామదిలో ఈ వేళ.. ప్రేమందో ఏమో అనుమానం కలిగేలా..’’ అనే మాంచి మెలోడీ సాంగ్‌ను కూడా జత చేసింది కాంగ్రెస్. ఆ వీడియోపై.. అధికారిక పొత్తులంట కదా.. అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీంతో.. ఈ పోస్టును కాంగ్రెస్ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా.. ఈ పోస్టుపై నెటిజన్లు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లతో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ‘‘ఔనూ వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..’’ అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘‘అది రిలేషన్ షిప్ కాదు ఇరిగేషన్ షిప్..’’ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక దీనిపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
లివింగ్ రిలేషన్షిప్ కాస్త త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనుంది#BJPBRSDosti pic.twitter.com/oHcUCuTXAN
— Aapanna Hastham (@AapannaHastham) February 21, 2024