ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి తనని తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధిóనేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. తానొక అర్జునుడిలాగా, మేమంతా కౌరవులంలాగా జగన్ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. అర్జునుడు ఆడపిల్లలను రక్షించాడు కానీ తూలనాడలేదని.. సొంత సోదరినే తూలనాడిరచే జగన్ ఎలా అర్జునుడు అవుతాడని నిలదీశారు. తన సొంత చెల్లెలకు కనీస గౌరవం కూడా ఇవ్వని వ్యక్తి జగన్. సొంత చిన్నాయనను నిర్ధాక్షిణ్యంగా చంపిన వారిని వెనుకేసుకొచ్చే వ్యక్తి జగన్ అని తూర్పారపట్టారు. వివేకా కూతురు తనకు రక్షణ లేదని, చంపేస్తారని భయపడుతున్నారని.. వారికి రక్షణ ఇవ్వలేని వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నాడంటూ దుయ్యబట్టారు. ఇది మహాభారతం కాదని, కలియుగమని, కాబట్టి ఎవరూ అర్జునుడు, కర్ణుడితో పోల్చుకోవద్దని సూచించారు. మీది వైసీపీ, మాది జనసేన అని.. ఎవరు మంచి చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఏపీలో దిగజారిన రాజకీయం మరెక్కడా లేదని విమర్శించారు. వచ్చే తరానికి విలువలతో కూడిన రాజకీయం తాను నేర్పిస్తానని మాటిచ్చారు. తనని పవర్ స్టార్ అంటుంటారని.. పవర్ లేని వ్యక్తిని పవర్ స్టార్ అనడం ఎందుకని పేర్కొన్నారు. తానెప్పుడూ ప్రజల మనిషిగా ఉండటానికే ఇష్టపడతానని వివరించారు. సిద్ధం సిద్ధం అంటూ జగన్ రాష్ట్రం మొత్తం పోస్టర్లు పెట్టించారని.. అసలు అవి ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
మాట తప్పింది జగన్...మడమ తిప్పింది జగన్ !
జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనని, ఇక దేనికి సిద్ధమని ఎగతాళి చేశారు. సీపీయస్ రద్దు, మద్యపాన నిషేధం, ఉద్యోగాల భర్తీ వంటి విషయాల్లో జగన్ మాట తప్పారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ని ఎండగడతామని హెచ్చరించారు. జగన్ మాటలకు కత్తుల్లా తమ మాటలు దూసుకొస్తాయని వార్నింగ్ ఇచ్చారు. అన్నింటికీ సమాధానం చెప్పే రోజులు తప్పకుండా వస్తాయని.. తాను చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమని తేల్చి చెప్పారు. సత్యాన్ని ఆవిష్కరించిన తర్వాత తాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆదివారం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలోకి చేరిన అనంతరం జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను బాలశౌరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని అన్నారు. వైసీపీలో ఉన్నంతకాలం ఆయన్ను చాలా బాధపెట్టారని, ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు.
పొత్తుల్లో సీట్ల సర్దుబాటు కష్టంగా ఉంది
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా సీట్ల సర్దుబాటు విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల్లో మనకు కొంచెం కష్టంగా ఉంటుందని, ప్రధానంగా సీట్ల సర్దుబాటులో కొంతమందికి బాధ అనిపిస్తుందని చెప్పారు. సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీలతో కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. అయితే.. అన్నీ సర్దుకునే తాము ముందుకు వెళ్తున్నామన్నారు. టీడీపీతో కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. పోటీ చేసే స్థానాల్లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన గెలిచే స్థానాలతో 98 శాతం విజయవకాశాలు ఉంటాయని, ఇందులో మీ అందరి అభిమానం ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ బలమైన పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో జనసే, టీడీపీ ప్రభుత్వాన్ని తప్పకుండా స్థాపించబోతున్నామని పవన్ కళ్యాణ్ నమ్మకం వెలిబుచ్చారు. జగన్ అనే దుర్మార్గపు పాలన నుంచి మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలని చెప్పారు. జగన్ కారణంగా ఆంధ్ర రాష్ట్రం ఐదేళ్లు వెనక్కు వెళ్లిపోయిందని, మరోసారి జగన్ వస్తే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలని సూచించారు. తన మీద నమ్మకంతో అందరూ తనతో నడవాలని, జనసేనకు అండగా ఉండాలని కోరారు. అన్నింటికీ సమాధానం చెప్పే రోజులు తప్పకుండా వస్తాయని.. తాను చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమని పవన్ తేల్చి చెప్పారు. ఇదిలావుండగా.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ సందర్భంగా.. ఇరుపక్షాల నేతల మధ్య ఎవరెవరు, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇరుపక్షాల చర్చలు జరిపారని.. దీనిపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చారని తెలిసింది. అలాగే.. ఇటీవల పొత్తుకు సంబంధించి వచ్చిన కామెంట్లపై కూడా చర్చ జరిగిందని సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభలపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని.. వీటికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.