Union Budget 2024-25 : ఎన్నికలే టార్గెట్‌గా... మధ్యంతర బడ్జెట్‌ !

0

సార్వత్రిక ఎన్నికల ముంగిట.. పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 47.65 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. అంతకుముందు బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గతేడాది మాదిరిగా ఈసారీ పేపర్‌లెస్‌ బడ్జెట్‌నే ప్రవేశపెట్టారు. మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్‌ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివి వినిపిస్తున్నారు. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. దీంతో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును ఆమె సమం చేశారు. దేశంలో తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఘనత సాధించిన ఆమె.. 2019 జులై నుంచి ఇప్పటివరకు ఐదు పూర్తి స్థాయి బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

పన్ను చెల్లింపు దారులకు అభినందనలు

ఆదాయ పన్ను వర్గాలకు నిర్మలా సీతారామన్‌ తాత్కాలిక బడ్జెట్‌లో ఉపశమనం కలిగించే ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. గత ఏడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానమే ఈసారి కూడా కొనసాగుతుందని, రూ.7 లక్షల వరకూ ఎలాంటి పన్ను భారం ఉండదని చెప్పారు. ప్రత్యక్ష, పరోక్ష, దిగుమతి సుంకాలకు పాత పన్ను విధానమే కొనసాగుతుందని తెలిపారు. గత పదేళ్లుగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగింది. రిటర్న్‌ ఫైలర్స్‌ 2.4 రెట్లు పెరిగాయి. పన్ను చెల్లింపుదారుల వాటాను దేశ సంక్షేమం, ప్రజల సంక్షేమానికి తెలివిగా ఖర్చుచేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. పన్ను చెల్లింపుదారులు ఇస్తున్న సపోర్ట్‌కు అభినందిస్తున్నాను. ప్రభుత్వం పన్ను రేట్లను హేతుబద్ధం చేసింది. కొత్త పన్నుల పథకం కింద, రూ.7 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదు. ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టుబడులతో పని ఉండదు. అంతకు మించి ఆదాయం కలిగిన వారికి శ్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది. గత ఏడాది ప్రతిపాదిత పాత పన్ను విధనంలో ఆదాయ పరిమితి రూ.2.50,000 గానే ఉంటుంది. పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎలాంటి భారం ఉండదు. ప్రస్తుతం ఉన్న దేశవాళి కంపెనీల కార్పొరేట్‌ టాక్స్‌ రేటు 30 శాతం నుంచి 22 శాతం తగ్గించాం. నిర్దిష్టమైన కొత్త మ్యాన్యుఫ్యాక్టరింగ్‌ కంపెనీలకు పన్ను రేటు 15 శాతం చేశాం’’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పలు కీలక విషయాలు వెల్లడిరచారు. మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు.

ఆదాయం 50 శాతం పెరిగింది

దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందన్నారు. గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయని చెప్పారు. దేశ ప్రజలు భవిష్యత్తు వైపు ఆశగా, ఆశావాదంతో చూస్తున్నారన్న ఆమె.. ప్రజల ఆశీర్వాదంతో 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ మంత్రంతో దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని గుర్తు చేసుకున్నారు. ఆ సవాళ్లను సీరియస్‌గా తీసుకున్న మోదీ ప్రభుత్వం.. వాటిని సమర్థవంతంగా అధిగమించిందని వెల్లడిరచారు. మధ్య తరగతికి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్‌ స్కీమ్‌ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్‌  ప్రసంగంలో పేర్కొన్నారు. 

2 కోట్లు ఇళ్ళ నిర్మాణం 

 అలాగే, పీఎం ఆవాస్‌ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ‘పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌’ కరోనా కాలంలోనూ కొనసాగిందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు.

కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌

విద్యుత్‌ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్‌లో నూతన పథకాన్ని ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్‌టాప్‌ సోలారైజేషన్‌ స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా రూ. 15వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఈ పథకం గురించి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

మా ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందరికీ ఇల్లు, ఇంటింటికి నీరు, బ్యాంకు ఖాతా, ఆర్థిక సేవలు అందిస్తున్నాం. 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇస్తున్నాం. తద్వారా ఆహార సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. రైతులకు మద్దతు ధర పెంచాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేశాం. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించాం. పేదలు, మహిళలు, యువత, రైతులపై ప్రత్యేక దృష్టి సారించాం. అందరినీ కలుపుకొని సమ్మిళిత అభివృద్ధికి కృషి కొనసాగుతోంది.

- నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !