కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోనియాతో పాటు బీజేపీ నేతలు చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాజస్థాన్ నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జైపూర్ అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు. రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో బరిలో మరెవరు లేకపోవడంతో ఈ ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు అధికారి తెలిపారు. రాజస్థాన్‌లో 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. లోక్‌సభ ఎంపీగా 6 పర్యాయాలు పనిచేసిన సోనియా గాంధీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు చెందిన జైపూర్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా సోనియా 2006 నుంచి రాయ్‌బరేలీ నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ అమెథీలో రాహుల్ ఓడిపోయినప్పటికీ సోనియా రాయ్‌బరేలీ స్థానాన్ని గెలుచుకొని ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక స్థానంగా నిలిచింది. ప్రస్తుతం రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన రెండో నాయకురాలు సోనియా గాంధీ కావడం విశేషం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1964 ఆగస్టు నుండి 1967 ఫిబ్రవరి వరకు ఎగువ సభలో సభ్యురాలిగా ఉన్నారు. మరోవైపు తెలంగాణలోనూ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణ నుంచి మూడు స్థానాలకు ముగ్గురే బరిలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా రిటర్నింగ్ అధికారులు వెల్లడిరచారు. మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.