Koratala Siva : శ్రీమంతుడు కథ కాపీ వివాదం...స్పందిచిన టీమ్‌ !

0

మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ సినిమా సమస్యల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాను రాసిన నవల ‘చచ్చేంత ప్రేమ’ను కాపీ కొట్టి ఆ చిత్రాన్ని తీశారని రచయిత శరత్‌ చంద్ర ఆరోపించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన స్క్రిప్టు తనదేనని దర్శకుడు అంగీకరించాలని కోరారు. సినీ పెద్దలు రాజీ కుదర్చడానికి ప్రయత్నించారని చెప్పారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై చిత్ర బృందం స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్రీమంతుడు’, ‘చచ్చేంత ప్రేమ’.. రెండూ పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉన్నాయి. వేటికవే విభిన్నం. పుస్తకం, సినిమాను పరిశీలించి ఈ వాస్తవాన్ని గుర్తించొచ్చు. ప్రస్తుతం ఈ వ్యవహారం లీగల్‌ రివ్యూలో ఉంది. అందువల్ల అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఓపిక పట్టండి. చట్టపరమైన ప్రక్రియపై మాకు నమ్మకం ఉంది’’ అని పేర్కొంది.

ఏం జరిగిందంటే..?

2015లో విడుదలైన ‘శ్రీమంతుడు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఆ సమయంలోనే ఆ చిత్రాన్ని తన నవల ఆధారంగా తెరకెక్కించారంటూ శరత్‌ చంద్ర హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కొరటాలకు చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టగా అక్కడా అదే పరిస్థితి. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.తాజాగా రచయిత శరత్‌ చంద్ర  స్పందిస్తూ తనకు నష్టపరిహారం ఇవ్వమని కోరడం లేదని చెప్పారు. ఈ మేరకు ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘2012లో నేను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. ఆ కథతో ఒక సినిమా చేస్తే బాగుంటుందని దర్శకుడు సముద్రను కలిశా. మేం ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాలనుకున్న సమయంలో ‘శ్రీమంతుడు’ విడుదలైంది. అది చూసిన మిత్రులు.. అది నా కథేనన్నారు. దాంతో నేనూ ఆ సినిమా చూశా. నా కథలో ఉన్నది ఉన్నట్లు స్క్రీన్‌పై చూసి షాకయ్యా. దర్శకుడితో మాట్లాడా. ఇది నా కథేనని చెప్పా. దానికి ఆయన అంగీకరించలేదు. సినీ పెద్దలు కొంతమంది రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. రూ.15 లక్షలు ఇస్తామన్నారు. ఈ విషయంలో రచయితల అసోసియేషన్‌ నాకు ఎంతో సాయం అందించింది. వాళ్ల సహకారంతోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించా. ఈ స్క్రిప్ట్‌ నాదేనని అంగీకరించమని కోరుతున్నా’’ అని శరత్‌ చంద్ర అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !