Sundaram Master Review : సుందరం మాస్టర్‌ సినిమా రివ్యూ

0

అగ్ర కథానాయకుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. తన నిర్మాణ సంస్థ ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ పతాకంపై కొత్తతరాన్ని పరిచయం చేస్తూ చిత్ర నిర్మాణం కొనసాగిస్తున్నారు రవితేజ. ఆయన సంస్థ నుంచి వస్తున్న మరో చిత్రమే... ‘సుందరం మాస్టర్‌’. హాస్య నటుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన హర్ష చెముడు కీలక పాత్రలో నటించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవ్వులు పంచడంలో తనకంటూ ఓ ప్రత్యకమైన శైలి ఉన్న హర్ష ఎలాంటి ప్రతిభ చూపించారు? ఈ చిత్రం ఎలా ఉంది?

కథేంటంటే

సుందరం మాస్టర్‌ (వైవా హర్ష) గవర్నమెంట్‌ స్కూల్‌లో టీచర్‌. అతనికి కట్నం మీద ఆశ ఎక్కువ, అందుకని ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారా అని పెళ్లి ప్రయత్నాల్లో ఉంటూ ఉంటాడు. ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్షవర్ధన్‌) కి మిరియాల మెట్ట గ్రామం నుండి తమ వూరికి ఒక ఇంగ్లీష్‌ ఉపాధ్యాయుడిని పంపించమని లేఖ వస్తుంది. మిరియాల మెట్ట అనే గ్రామ ప్రజలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వుంటారు, ఆ గ్రామంలోకి బయట వాళ్ళకి కూడా ప్రవేశం లేదు. కానీ ఆ గ్రామంలో ఒక విలువైన వస్తువు ఎదో ఉందని, ఆ వస్తువుని కనిపెట్టి ఆ గ్రామాన్ని తన నియోజకవర్గంలో కలిపేయాలని ఎమ్మెల్యే సుందరాన్ని కోరతాడు. దానితో తనకి పేరొస్తుందని, సుందరాన్ని డిఈఓ గా ప్రమోషన్‌ కూడా ఇస్తానని ఎమ్మెల్యే మాట ఇస్తాడు. ప్రొమోషన్‌ వస్తే కట్నంగా ఇంకా ఎక్కువ డబ్బు రాబట్టవచ్చు అని సుందరం కూడా ఆ గ్రామానికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. సుందరం ఇంగ్లీష్‌ టీచర్‌ గా మిరియాల మెట్ట గ్రామంలో అడుగుపెడతాడు. కానీ అతనికి ఆశ్చర్యంగొలిపే విషయం ఏంటంటే, అక్కడ ఆ గ్రామస్థులు అందరూ సుందరం మాస్టర్‌ కన్నా చక్కగా ఇంగ్లీష్‌ మాట్లాడుతూ వుంటారు. సుందరంకి ఇంగ్లీష్‌ సరిగ్గా రాదనీ అతనికే ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఫెయిలైతే ఉరితీత అని చెప్తారు గ్రామస్థులు. మరి ఆ పరీక్షలో సుందరం సఫలం అయ్యాడా, విఫలం అయ్యాడా, ఇంతకీ ఆ వూర్లో వున్నా విలువైన వస్తువు ఏంటి? అది సుందరం కనిపెట్టాడా? అతనికి ప్రమోషన్‌ వచ్చిందా? ఇంతకీ అతని పెళ్లి సంగతి ఏమైంది? ఇంతకీ ఆ ఊరి వెనకున్న చరిత్ర ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే ‘సుందరం మాస్టర్‌’ సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే

బయట ప్రపంచంతో  సంబంధం లేని కొన్ని ప్రాంతాల గురించి అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. అక్కడి మనుషుల్లోని స్వచ్ఛత, అమాయకత్వం, కట్టుబాట్లు, అలాంటి ప్రాంతాల చరిత్ర వినేకొద్దీ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి నేపథ్యంలో సాగే చిత్రమే ఇది. ప్రధాన పాత్రధారి వైవా హర్ష ఇమేజ్‌ని దృష్టిలోఉంచుకుని పూర్తిస్థాయి హాస్యభరిత చిత్రం అనే అంచనాలతో వెళితే ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. హాస్యం ఉంటుంది కానీ, సినిమా మొత్తం అదే ఉండదు. మిర్యాలమెట్ట అనే ఓ ప్రత్యేకమైన ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి ప్రకృతి, మానవత్వాన్ని మేళవించి ఓ మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. కథ చెప్పే క్రమంలో అక్కడక్కడా తడబాటు కనిపించినా ఓ కొత్త రకమైన చిత్రం చూసిన అనుభూతిని మాత్రం పంచాడు దర్శకుడు. సుందరం మాస్టార్‌ పాత్రని పరిచయం చేయడం మొదలుకొని అతను మిరియాల మెట్టకి వెళ్లి ఇంగ్లిష్‌ నేర్పించే ప్రయత్నంలో ఎదుర్కొనే ఇబ్బందులు, అక్కడి జనాలు అలవాట్లు, ఆచారాలతో ప్రథమార్ధం సరదా సరదాగా సాగిపోతుంది. అరగంట పాటు  వైవా హర్ష మార్క్‌  కామెడీ సన్నివేశాలతో సినిమా సందడిగా సాగుతుంది. ఆ తర్వాత ఊరి చరిత్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది.ద్వితీయార్ధం మొత్తం విలువైన వస్తువు కోసం సాగించే అన్వేషణ చుట్టూనే కథ నడుస్తుంది. దర్శకుడు కళ్యాణ్‌ సంతోష్‌ ఈ సినిమాని అటు వినోదాత్మకంగా కానీ, ఇటు ఏదైనా కథాబలం వున్న సినిమాగా కానీ తెరకెక్కించాడా అంటే రెండిటికి మధ్యలో అదీ ఇదీ లేకుండా చూపించాడు. అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో కూడా అది చెప్పలేకపోయాడు. అక్కడక్కడా ఒకటి రెండు వినోదాత్మక సన్నివేశాలు తప్పితే విషయం లేదు, కథ లేదు, భావోద్వేగాలు అసలే లేవు. దర్శకుడు ఆ గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకి తమకి ఇంగ్లీష్‌ టీచర్‌ కావాలని లేఖ రాసినట్టు చెప్పాడు అంటే వాళ్ళకి బయటి ప్రపంచంతో సంబంధం వుంది అని చెప్పాడు. ఇంకో దగ్గర అసలు వాళ్ళకి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని కూడా తెలియదు అని చూపించాడు. కథ సరైనది లేకుండా కేవలం రెండు గంటలకి పైగా ఎదో అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలు పెట్టి సినిమా నడిపిద్దాం అని అనుకుంటే నడవకపోవచ్చు. మొదటి సగం ఇంకా కొంచెం నయం కానీ, రెండో సగం అయితే పూర్తిగా నిరాశ పర్చాడు అనే చెప్పాలి. విలువైన వస్తువు చుట్టూ రెండో సగం అంతా నడుస్తుంది కానీ అది అంత ఆసక్తికరంగా చూపించలేకపోయారు. గ్రామంలో ప్రజలని గిరిజనులుగా చూపించడం, వాళ్ళు ఇంగ్లీష్‌ మాట్లాడటం, అవన్నీ ఎందుకో ప్రేక్షకుడికి అంత ఆసక్తికరంగా లేవనే చెప్పాలి.

ఎవరెలా చేశారంటే

తనకి తగ్గ పాత్రలోనే కనిపించాడు వైవా హర్ష. సుందరం మాస్టర్‌ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రథమార్ధంలో తనకి అలవాటైన నటనతో నవ్వించాడు. ద్వితీయార్థంలో అసలు కథని చెప్పే క్రమంలో ఆయనకి  హాస్యం పండిరచే అవకాశం దక్కలేదు. హాస్యంతోపాటు, ఇతర  భావోద్వేగాల్ని పండిరచే అవకాశం కూడా ఆయనకి దక్కింది. దివ్య శ్రీపాద  మిరియాల మెట్టలోని ఓ అనాథ అమ్మాయిగా కనిపిస్తుంది.  ఆమె కనిపించిన విధానం, అభినయం ఆకట్టుకుంటుంది.  ఓజా పాత్రలో చైతన్య,  ఆ ఊరి గ్యాంగ్‌ నటన మరింతగా ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ, హర్షవర్ధన్‌, భద్రం తదితరులు పాత్రల పరిధి మేరకు మంచి అభినయం ప్రదర్శించారు. యువరాజ్‌ సింగ్‌, బ్రహ్మానందంలని చూపిస్తూ తీర్చిదిద్దిన సన్నివేశాలు సినిమాకి హైలైట్‌. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా  ఉంది. ముఖ్యంగా  కళా విభాగం పనితీరు హత్తుకుంటుంది. నిజంగా అలాంటి ఊరు ఉందేమో అనేలా ఆ ప్రపంచాన్ని సృష్టించారు కళా దర్శకుడు చంద్రమౌళి. శ్రీచరణ్‌ పాకాల సంగీతం చిత్రానికి మరో అదనపు ఆకర్షణ. ఎగిసే పాటతో మంచి భావోద్వేగాలు పండాయి.  విజువల్స్‌తో ఛాయాగ్రాహకుడు దీపక్‌ కట్టిపడేశాడు. దర్శకుడు కల్యాణ్‌ సంతోష్‌ నిజాయతీగా ఓ మంచి ప్రయత్నం చేశాడు. ద్వితీయార్ధంలో కథనం కాస్త పట్టుతప్పినట్టు అనిపించినా, ఆయన కథాలోచన, రచన బాగుంది.  భావోద్వేగాలు బాగా పండాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.  సినిమాకి పరిధులు ఉన్నప్పటికీ, నిర్మాణంలో నాణ్యత కనిపిస్తుంది.

ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !