ఏపీలో పొత్తులు టీడీపీ లీడర్స్‌కు తలనొప్పిగా మారుతున్నాయి. కొత్త పదవులొస్తాయని ఆశిస్తే.. ఉన్న పదవులు ఊడగొట్టేలా ఉన్నాయి. కూటమితో ఇన్ని కష్టాలా..అని నాయకులు వాపోతున్నారు. త్యాగాలు చేయమని స్టేట్‌మెంట్లు ఇవ్వడం వరకు ఓకే.. ఆ త్యాగాలు తామే చేయాల్సిరావడమే బాధాకరం కదా.. చిన్నాచితకా లీడర్లంటే ఏదో సర్దుకుపోవచ్చు. బడా నేతల సీట్లకే ఎసరు వస్తే ఎలా? టీడీపీ-జనసేన కూటమిలో సీట్ల పంచాయితీ రెండు పార్టీల్లోనూ టెన్షన్ పెంచుతోంది. రెండు పార్టీల అగ్రనాయకత్వం సీట్ల పంపిణీ, సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చినా.. క్షేత్రస్థాయిలోనే సమస్య జటిలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
టీడీపీ, జనసేన నేతల్లో టెన్షన్..
పొత్తులు పొసగటం లేదు. టీడీపీ లీడర్లకు ఊపిరి ఆడనీయడం లేదు. సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చామంటున్న అగ్రనాయకత్వం.. క్యాడర్‌కు ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడం.. మిత్రపక్షం జనసేన లీడర్లు.. ఫలానా సీటు మాదే.. ఫలానా చోట నుంచి పోటీ చేసే అభ్యర్థి నేనేనంటూ ప్రచారం చేసుకుంటుండటం.. టీడీపీ సీనియర్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అదే సమయంలో తమదేననుకుంటున్న సీటుపై టీడీపీ అగ్రనేతలు పాగా వేయాలని చూస్తుండటం జనసేన నేతలకూ టెన్షన్ కు గురిచేస్తోంది. ఇలా రెండు పార్టీల్లోనూ క్లారిటీ లేకపోవడంతో జిల్లా స్థాయిలో ఇరుపక్షాల్లో అపోహలు, అనుమానాలు ఎక్కువవుతున్నాయి. టీడీపీ-జనసేన మధ్య పొత్తుపొడిచి నాలుగు నెలలు అవుతున్నా.. జిల్లా.. నియోజకవర్గ స్థాయిల్లో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య అవగాహన లేకుండా పోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం ఫెవికాల్ అంత ధృడంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. పొత్తు ఉంటుందని.. పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తామని రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు బలంగా నమ్ముతున్నాయి. కానీ, సీట్లు సర్దుబాటులోనే పంచాయితీ తెగడం లేదు. ఈ రెండు పార్టీల అగ్రనేతలు కూడా ఈ విషయంపై ఎక్కడా ఎలాంటి ప్రస్తావన చేయడం లేదు. దీంతో ఎవరి సీటు గల్లంతు అవుతుందనేది తెలియక రెండు పార్టీల నేతలు అనుక్షణం టెన్షన్ పడుతున్నారు.
రోజురోజుకి జటిలంగా మారుతున్న పరిస్థితులు..
ముఖ్యంగా విశాఖ, తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో పరిస్థితులు రోజురోజుకు జటిలంగా మారుతున్నాయి. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ సీట్ల సర్దుబాటుపై క్యాడర్‌కు సంకేతాలిస్తున్నా.. ఏ ఏ స్థానాలు అడుగుతుందీ? ఏ స్థానాలు కేటాయించే పరిస్థితి ఉందన్న విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. దీంతో ఇటు జనసేన.. అటు టీడీపీ నేతలు హైటెన్షన్ అనుభవిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు అసెంబ్లీ, ఓ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. జిల్లాలో మొత్తం 15 స్థానాలు ఉండగా, నాలుగు సీట్లు అడుగుతుండటం.. అవి కూడా విశాఖ నగరంలోని టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గాలు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు వస్తున్న సమాచారం పసుపు దండుకి కలవరపాటుకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ నగరంలో ఏకపక్ష విజయం సాధించింది టీడీపీ. ఇలాంటి చోట కర్చీఫ్ వేయాలని మిత్రపక్షం కోరడాన్ని టీడీపీ నేతలు తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు.
తీవ్ర ఆందోళనలో గండి బాబ్జీ..
టీడీపీ వరుసగా గెలుస్తున్న విశాఖ దక్షిణ సీటుతోపాటు ఆ పార్టీకి గట్టి పునాది ఉన్న భీమిలి, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి అసెంబ్లీ, అనకాపల్లి లోక్‌సభ స్థానాన్ని జనసేన ఆశిస్తోందనే ప్రచారంతో టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. విశాఖ దక్షిణ గత రెండు సార్లు టీడీపీయే గెలిచింది. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీలో చేరగా, నియోజకవర్గంలో ఆ పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. ఎమ్మెల్యే పార్టీకి దూరమైన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి సౌత్ బాధ్యతలను తన భుజానకెత్తుకున్నారు. ఇప్పుడు జనసేనలో కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌తోపాటు కార్పొరేటర్ సాధిక్ దక్షిణ సీటుపై గురిపెట్టడంతో గండి బాబ్జీ ఆందోళన చెందుతున్నారు.
భీమిలి నుంచైనా పోటీ చేస్తానని పట్టు..
ఇదే విధంగా భీమిలి సీటుపైనా రెండు పార్టీల్లోనూ టెన్షన్ కనిపిస్తోంది. భీమిలి తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భీమిలిలో సైకిల్ స్పీడ్‌కు ఎదురే లేకపోయింది. ఐతే.. ఈ సీటుపై జనసేన నేత పంచకర్ల సందీప్ చాలా ఆశలు పెంచుకుంటున్నారు. ఏకంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు సందీప్. ఇదే సమయంలో విశాఖ దక్షిణ సీటు కుదరకపోతే.. భీమిలి నుంచైనా పోటీ చేస్తానంటూ ఎమ్మెల్సీ వంశీకృష్ణ రెడీ అవుతున్నారు.
ఈ నియోజకవర్గాల్లో ఎవరికి ఎర్త్?
భీమిలిలో జనసేన నుంచే ఇద్దరు నేతలు పోటీపడుతుండగా, ఇదే స్థానం నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెబుతుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భీమిలిలో టీడీపీ ఇన్‌చార్జిగా కోరాడ రాజబాబు పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటే.. ఇప్పుడు సీనియర్ నేత గంటాతోపాటు జనసేన నేతలు గద్దలా తన సీటు తన్నుకుపోతారా? అంటూ ఆందోళన చెందుతున్నారు రాజాబాబు. మరోవైపు నగరంలోనే గాజువాక, పెందుర్తి సీట్లపైనా జనసేన కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అనకాపల్లి జిల్లా పరిధిలోని యలమంచిలి సీటును కూడా జనసేన ఆశిస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో ఒక్క యలమంచిలి తప్ప మిగిలిన రెండుచోట్ల టీడీపీ, జనసేనకు బలమైన నేతలు ఉండటంతో ఎవరికి ఎర్త్ పెడతారనేది సస్పెన్స్‌గా మారింది.
పెందురి సీటు ఆశిస్తున్న జనసేన నేత..
గాజువాకలో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బలమైన అభ్యర్థిగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో జనసేనాని పవన్ పోటీ చేసి ఓటమి చెందడంతో.. ఈసారి గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది జనసేన.. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు జనసేన నుంచి పెందుర్తిలో పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి జనసేన సీనియర్ నేత తమ్మిరెడ్డి శివశంకర్ ఎప్పటి నుంచో పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. స్థానికంగా రెండు పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు శివశంకర్.
ప్రశ్నార్థకంగా చింతకాయల విజయ్ భవితవ్యం..
మరోవైపు పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ తరఫున మాజీ మంత్రి బండారు ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే శివశంకర్‌కు సీటు ఇచ్చినా ఓకేగాని, పంచకర్లకు మాత్రం సీటు వదులుకునే ప్రసక్తిలేదని బండారు చెబుతుండటం ఇక్కడ చర్చకు తావిస్తోంది. ఇక అనకాపల్లి లోక్‌సభ ఆశిస్తున్న జనసేన.. అనకాపల్లి అసెంబ్లీ సీటును అడుగుతోందంటున్నారు. లోక్‌సభకు నాగబాబు, అసెంబ్లీకి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తారంటున్నారు. దీంతో ఇన్నాళ్లు అనకాపల్లి లోక్‌సభపై ఆశలు పెట్టుకున్న చింతకాయల విజయ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇలా జనసేన అడుగుతున్న నియోజకవర్గాల్లో యలమంచిలిపై టీడీపీకి ఎలాంటి అభ్యంతరం కనిపించడం లేదు. ఇక్కడ ఆ పార్టీకి బలమైన నేతలు లేకపోవడం వల్ల జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమంటున్నారు. యలమంచిలిలో జనసేన తరఫున సుందరపు విజయ్‌కుమార్ లేదా ఆయన సోదరుడు సుందరపు సతీశ్‌కుమార్ పోటీ చేయనున్నారు. ఈ ఇద్దరూ రెండు సీట్లు అడుగుతున్నా, ఏదో ఒకటే కేటాయించే పరిస్థితి ఉందంటున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నా.. అనుమానాలను పెంచేస్తున్నాయి. అధినాయకత్వం స్పష్టమైన ప్రకటన చేస్తేగాని.. ఈ సస్పెన్స్ తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు.