తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో, శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,75,891 కోట్లుగా బడ్జెట్ ఉంది. ప్రత్యేకించి ఆరు హామీలకు పద్దులో ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం రూ.53,196 కోట్లను రాష్ట్ర సర్కార్ కేటాయించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, యువ వికాసం పథకం, చేయూత పథకాలు ఉన్నాయి. అందులో రెండు హామీలను ఇప్పటికే అమలు చేసిన ప్రభుత్వం, మరో రెండిరటిని త్వరలోనే అమలు చేయనుంది. అన్ని గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని సర్కార్ తెలిపింది. దీంతో వీటి అమలుకు బడ్జెట్‌లో నిధులను కేటాయించింది.
అర్హులైన అందరికీ ఆరు హామీలు
అర్హులైన అందరికీ ఆరు హామీలు అందుతాయని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం రూ.2,418 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని భట్టి విక్రమార్క వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం చేస్తామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించనున్నట్లు చెప్పారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, త్వరలోనే అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ చేపడుతామని పేర్కొన్నారు. అలాగే రైతుబంధు నిబంధనలపై పునఃసమీక్ష చేస్తామని వివరించారు. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15,000 ఇవ్వనున్నట్లు, కౌలు రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడిరచారు.