MSP : రైతుల కనీస మద్దతు ధర డిమాండ్‌ చట్టబద్దత సమంజసమేనా ?

0

దేశ రాజధానిని మరోసారి చుట్టుముట్టేందుకు పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి రైతులు ట్రాక్టర్లతో బయలుదేరడంతో రైతు సమస్యలు, డిమాండ్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రైతుల డిమాండ్లలో అనేకాంశాలున్నాయి. వాటిలో ‘‘కనీస మద్దతు ధర’’ (మినిమం సపోర్ట్‌ ప్రైస్‌ - MSP) కీలకాంశం.

కేంద్రం ఎందుకు జాప్యం

దేశ రాజధానిని మరోసారి చుట్టుముట్టేందుకు పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి రైతులు ట్రాక్టర్లతో బయలుదేరడంతో రైతు సమస్యలు, డిమాండ్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రైతుల డిమాండ్లలో అనేకాంశాలున్నాయి. వాటిలో ‘‘కనీస మద్దతు ధర’’ (మినిమం సపోర్ట్‌ ప్రైస్‌) కీలకాంశం. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సగటున వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను 115% పెంచినట్టు గణాంకాలు చూపిస్తోంది. అయినా రైతులు ఈ విషయంలో ఎందుకు ఉద్యమానికి సిద్ధపడ్డారన్నదే అసలు ప్రశ్న. అందులోనూ యావద్దేశానికి వ్యవసాయంలో మార్గదర్శకులుగా ఉండే పంజాబ్‌ రైతులే ఈ ఉద్యమానికి నేతృత్వం వహించడం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్న విమర్శలు మరోవు ఉన్నాయి. వీటి సంగతెలా ఉన్నా.. రైతుల డిమాండ్లలో కీలకాంశమైన ‘‘కనీస మద్దతు ధర’’కు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందో తెలుసుకోవాలంటే.. దానితో ముడిపడ్డ ఇతర సంక్లిష్టతల గురించి తెలుసుకోవాలి. 

మద్దతు ధర ఎందుకు?

వ్యవసాయానికి ముఖ్యంగా వివిధ రకాల పంటల సాగుకు అనువుగా ఉండే దేశాల్లో భారత్‌ ఒకటి. మొత్తంగా వ్యవసాయ భూమి పరిమితమైన వనరు. కానీ భూగోళంపై జనాభా మాత్రం అపరిమితంగా పెరిగిపోతోంది. అందులో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. అందరి ఆకలి తీర్చాలంటే ఆ పరిమిత వ్యవసాయ భూమి నుంచే ఉత్పాదకతను పెంచాలి. అందుకు తగిన ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆచరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, భూసారాన్ని పెంచే చర్యలు అమలు చేయాలి. ఇవన్నీ రాత్రికి రాత్రికి జరిగే పనులు కావు. ఇలాంటి సమర్థవంతమైన వ్యవసాయ విధానాలు ఏర్పడే వరకు రైతుల ఉత్పత్తులకు ‘‘కనీస మద్దతు ధర’’ ఉండాలని, అలాగే ప్రభుత్వం ద్వారా సేకరణ, ప్రభుత్వం ద్వారానే పంపిణీ జరగాలని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సు చేశారు. ఈ మద్దతు ధరను లెక్కించడానికి ఒక సూత్రం (ఫార్ములా)ను కూడా రూపొందించారు. ఆ ప్రకారం వ్యవసాయ ఉత్పత్తి వ్యయానికి 50% కలిపితే మద్దతు ధర వస్తుంది. ఉదాహరణకు ఒక పంట సాగుకు ఎకరాకు రూ. 10,000 ఉత్పత్తి వ్యయం అనుకుంటే.. మద్దతు ధర రూ. 15,000 ఉండాలి. కానీ ఈ ధరను లెక్కించే విషయంలోనే కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి.

MSP ఎలా లెక్కిస్తారు?

ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ప్రకారం వ్యవసాయ ఉత్పత్తి వ్యయంలో ఎరువులు విత్తనాలు, కూలీల ఖర్చు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ భారతదేశ వ్యవసాయంలో సామాజిక ఆర్థిక వాస్తవికతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వ్యవసాయమే జీవనోపాధిగా దేశంలోని అత్యధిక ప్రజానీకం ఆధారపడి ఉంది. కానీ వారికిది లాభసాటిగా లేదు. అందుకే ఎన్నో తరాలుగా వ్యవసాయంపై ఆధారపడ్డ వర్గాలు ఇప్పుడు తమ పిల్లల్ని వ్యవసాయంలో కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. వ్యవసాయాన్ని జీవనోపాధిగా కొనసాగించడానికి విముఖత చూపుతున్నాయి. ప్రత్యామ్నాయ ఆదాయమార్గాల వైపు దృష్టి సారిస్తున్నాయి. వ్యవసాయంలో రైతుల కుటుంబ శ్రమ, భూమి ఖర్చులు, కౌలు వంటివి కనీస మద్దతు ధరను లెక్కించే విషయంలో పరిగణలోకి రావడం లేదు. తద్వారా మొత్తం వ్యవసాయ ఉత్పత్తి వ్యయం పరిగణలోకి రావడం లేదు. ఫలితంగా పంటలకు ప్రకటించిన మద్దతు ధర రైతులకు లాభసాటిగా మారడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా సంవత్సరానికి రెండుసార్లు దాదాపు రెండు డజన్ల వస్తువులకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తోంది. ఈ మద్దతు ధరకు చట్టబద్దత లేదు. పర్యవసానంగా రైతుల ఉత్పత్తులను మద్దతు ధరతో ప్రభుత్వమే కచ్చితంగా సేకరించాలన్న పరిస్థితి లేదు. అలాగే చట్టపరమైన మద్దతు లేనందున ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే వారు న్యాయం కోసం ప్రభుత్వ యంత్రాంగం, న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం కూడా లేదు. కొనుగోలు చేసిన పంటల పరిమాణం, నాణ్యత రెండిరటినీ నిర్ణయించే అధికారం పూర్తిగా ప్రభుత్వానిదే కావడం వల్ల రైతులు కోరుకున్న ధర దక్కడం లేదు.

మద్దతు ధరతో చిక్కులు

రైతులు తాము పండిరచే అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఉండాలని, దాన్ని చట్టబద్ధం చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఆయా పంటల ప్రపంచ ధరల్లో హెచ్చుతగ్గులు, సేకరణ ఒత్తిళ్లు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. భారత్‌లో మద్దతు ధరకు సేకరించిన వ్యవసాయ ఉత్పత్తుల కంటే ప్రపంచంలో ఇంకా తక్కువ ధరకే లభిస్తున్నాయి. వరి, గోధుమ వంటి ఆహారధాన్యాల విషయంలో ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రభుత్వం సేకరించిన పంట దిగుబడిని వాణిజ్యం కోసం ఎగుమతి చేయడానికి వీల్లేదు. మిగతా పంటలతో పోల్చితే వరి, గోధుమ వంటి ప్రధాన ఆహార పంటల దిగుబడిని ప్రభుత్వం ‘‘కనీస మద్దతు ధర’’కు సేకరించడం వల్ల లాభసాటిగా ఉంటుందని రైతులు ఈ పంటల సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశీయ అవసరాలను మించి పంటల దిగుబడి వస్తోంది. ఆ నిల్వలు గోదాముల్లో మూలుగుతున్నాయి. పందికొక్కుల పాలవుతున్నాయి. మరోవైపు పప్పు దినుసులు, నూనె గింజల సాగు తగ్గిపోతుండడం వల్ల ఆయా ఉత్పత్తుల కొరత ఏర్పడి ధరలు పెరిగిపోతున్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. మరోవైపు అత్యధిక నీటిని వినియోగించే వరి సాగు కారణంగా నీటి వనరులపైనా ఒత్తిడి పెరుగుతోంది. పంటల వైవిధ్యం, సాగులో వైవిధ్యం కొరవడుతోంది.

వాస్తవ స్థితిగతులు ఎలా ఉన్నాయి? 

దేశ జనాభాలో 60 కోట్ల మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయానికి ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. అందులో వ్యవసాయం ద్వారా గడిరచే సంపాదనపై ఆదాయపు పన్ను లేకపోవడం ఒకటి. దీన్ని దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు సైతం అనేకం కనిపించాయి. అడ్డదారుల్లో సంపాదించే బడాబాబులు, సినీ ప్రముఖులు తమ ఆదాయాన్ని వ్యవసాయం ద్వారా గడిరచినట్టుగా చూపిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, రాజకీయాలు ఒకదానికొకటి ముడిపడ్డ సంక్లిష్టమైన అంశాలుగా మారాయి. ఫలితంగా పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు కలిగినవారు వ్యవసాయానికి అందించే ప్రోత్సాహకాలు, రాయితీలను పొందుతూ ఉన్నత స్థితిలో ఉంటే.. చిన్న, సన్నకారు రైతులు మాత్రం ఆర్థికంగా చితికిపోతున్నారు. అంటే పెద్దమొత్తంలో వ్యవసాయం లాభసాటిగా ఉండగా.. చిన్న కమతాల్లో సాగు మాత్రం కష్టాలను, నష్టాలను మిగుల్చుతోందని అర్థమవుతోంది. ఈ క్రమంలో చేపట్టే భూ సంస్కరణలు చిన్న కమతాలను వ్యక్తులు లేదా కార్పొరేట్‌ శక్తులు స్వాధీనం చేసుకునే అవకాశం కల్పిస్తాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే.. తరాలు మారే కొద్ది ఉన్న భూమిని తమ వారసులకు పంచిపెట్టడం వల్ల కమతాల సైజు కూడా తగ్గిపోతోంది.

మరోవైపు తయారీ, సేవా రంగాల్లో ఉన్న స్వేచ్ఛామార్కెట్‌ తరహా పరిస్థితులు వ్యవసాయానికి వర్తించవు. దేశంలో ఒక చోట తయారయ్యే వస్తువును ప్రపంచంలోనే మరెక్కడైనా విక్రయించుకునే వెసులుబాటు తయారీదారుడికి ఉంది. కానీ వ్యవసాయదారులకు ఆ పరిస్థితి లేదు. అందుకే ఏకకాలంలో మదనపల్లి మార్కెట్లో కిలో రూ. 2 కు టమాటను రైతులు అమ్మకోవడం లేదా ఆవేదనతో రోడ్లపై పారేయడం జరుగుతుంటే.. మరోవైపు కిలో రూ. 80 నుంచి రూ. 100 వరకు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దేశంలో మరో చోట కనిపిస్తోంది. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడికైనా, ముఖ్యంగా విదేశాలకు ఎగుమతి చేసే స్వేచ్ఛ లేదు. నిజమైన స్వేచ్ఛా-మార్కెట్‌ లో ఒక వరి రైతు సుదూర దేశంలో రూ. 200/కిలో బియ్యం ధరకు ఎగుమతి చేసే స్వేచ్ఛను కలిగి ఉండాలి. ఇది సుదూర వాస్తవికతగా మిగిలిపోయింది. రైతులు అమ్మే ధరకు, వినియోగదారుడు కొనే ధరకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మధ్య దళారులే అధిక లాభాలు అర్జిస్తున్నారు. కష్టపడి పనిచేసే రైతులు తమ ఉత్పత్తుల చివరి రిటైల్‌ అమ్మకపు ధరలో కొంత భాగాన్ని కూడా పొందడం లేదు. ఈ పరిస్థితుల్లో ‘‘కనీస మద్దతు ధర’’ చుట్టూ ఇప్పుడు రాజకీయం అలుముకుంది


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !