YS Sunitha : నాకు ప్రాణహాని ఉంది...హైద్రాబాద్‌ పోలీసులకు వైఎస్‌ సునీత ఫిర్యాదు !

0

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత హైదరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మధ్యకాలంలో కొందరు తనను చంపుతామని ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారని.. అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ శిల్పవల్లికి విజ్ఞప్తి చేశారు. లేపేస్తాం అని అర్థం వచ్చే విధగా పోస్టులు ఉన్నాయని.. ఈ తరహా బెదిరింపులు ఇటీవల ఎక్కువయ్యాయని తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తామని సైబర్‌ క్రైమ్‌ డీసీసీ శిల్పవల్లి పేర్కొన్నారు. కాగా, వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరగా.. త్వరలోనే సునీత కూడా హస్తం పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఏపీసీసీ చీఫ్‌గా ఉన్న షర్మిలను ఇటీవలే సునీత కలిశారు. ఇడుపులపాయలోని ఎస్టేట్‌లో దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరు చర్చలు జరిపారు. ఈ భేటీలో వైఎస్‌ వివేకా హత్య కేసుతో పాటు ఏపీ రాజకీయాలపైనా చర్చించినట్లు సమాచారం. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సునీత కలవడం ఇదే తొలిసారి.ఇక వైఎస్‌ వివేకా హత్య కేసుపై సునీత ముందు నుంచీ గట్టి పోరాటం చేస్తున్నారు. 

న్యాయం పోరాటం చేస్తున్న సునీతా రెడ్డి

తన తండ్రి హత్య వెనక ఎవరున్నారో తేల్చాలని.. కోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణను కోరారు. సీబీఐ విచారణటిలో ఇప్పటికే పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్‌ అయ్యారు. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి కూడా .. వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితులో ఉన్నారు. భాస్కర్‌ రెడ్డితో పాటు మరికొందరు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. అవినాష్‌ రెడ్డి బెయిల్‌పై బయట ఉన్నారు. తన తండ్రి హత్యకు సంబంధించి సుప్రీంకోర్టులో న్యాయం పోరాటం చేస్తున్న సునీతా రెడ్డి.. ఇటు రాజకీయంగానూ ఎదుర్కోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కడప ఎంపీ బరిలో అవినాష్‌ రెడ్డిపై ఆమె పోటీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య అనంతరం న్యాయం కోసం కుమార్తె వైఎస్‌ సునీత చేస్తున్న పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ సునీత తిరుగుతున్నారు. వైఎస్‌ వివేకా హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో బెదిరింపులు వచ్చినప్పటికీ సునీత వెనక్కి తగ్గలేదు. ఇటీవల తన సోదరి వైఎస్‌ షర్మిలను సునీత కలవడం, ఆమెతో పాటు ఇడుపులపాయకు వెళ్లడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఫిర్యాదులోని పలు అంశాలు ఇవే..

‘నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ నేను నా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నాను. గత కొన్ని రోజులుగా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌ పేజీలో నా పైన, నా సోదరి షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు. తీవ్ర అభ్యంతరకరమైన, అసహ్యకరమైన రీతిలో పోస్టులు ఉంటున్నాయి. వర్రా రవీంద్రారెడ్డి ఫేస్‌బుక్‌ పేజీలో మొత్తం షర్మిల, నాపై అనేక అవమానకరమైన పోస్టులు ఉన్నాయి. వర్రా రవీంద్ర రెడ్డి పరిధి దాటి పోస్టులు పెడుతున్నాడు. వర్రా రవీంద్ర రెడ్డి పెట్టే పోస్టులు మా ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయి. జనవరి 29న నా సోదరి షర్మిలతో పాటు నేను ఇడుపులపాయ వెళ్లాను. అనంతరం వర్రా రవీందర్‌ రెడ్డి తన పేజీలో నన్ను చంపేయాలి అని అర్థం వచ్చేట్టు ఒక పోస్ట్‌ పెట్టాడు. ‘‘అందుకే పెద్దలు అన్నారు శత్రు శేషం ఉండకూడదు లేపేయ్‌ అన్నాయ్‌ ఇద్దరినీ ఈ ఎన్నికలకు పనికి వస్తారు’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. నా స్నేహితులు నాకు ఫేస్‌బుక్‌ లింక్‌ పంపారు. రవీందర్‌ రెడ్డి ఫేస్‌బుక్‌ పోస్టులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నా తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను. నాకు ప్రాణహాని ఉందని పోలీసులకు, సీబీఐ కూడా ఫిర్యాదు చేశాను. రవీందర్‌ రెడ్డి ఫేస్‌బుక్‌ పేజీలో మొత్తం నన్ను షర్మిలను, వైఎస్‌ విజయమ్మను కించపరుస్తూ పోస్టులు ఉన్నాయి. చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేసేలా పోస్టులు పెట్టే వారిపై తగిన చర్యలు తీసుకోండి’’ అంటూ వైఎస్‌ సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !