YS SUNITHA : అంతఃకరణ శుద్ధి అనే మాటకు అర్థం తెలుసా ?

0

  • అన్న జగన్‌ను సూటిగా నిలదీసిన వివేకా కుమార్తె
  • వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో ఆత్మీయ సభ 

ముఖ్యమంత్రిగా అంతఃకరణ శుద్ధితో పని చేస్తానని ప్రమాణం చేసిన జగన్‌కు, ఆ మాటకు అర్థం తెలుసా అని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ పునాదులు వివేకానందరెడ్డి రక్తం, కోడికత్తి శ్రీను రక్తంతో తడిసిపోయి ఉన్నాయన్నారు. శుక్రవారం కడపలోని జయరాజ్‌ గార్డెన్స్‌లో వైఎస్‌ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా జరిగిన ఆత్మీయ సభలో సునీత ఉద్వేగ భరితంగా మాట్లాడారు. ‘‘వివేకా హత్య గురించి అనేక ఆరోపణలు చేస్తున్నారు. నేను, నా కుటుంబం ఏదో చేశామని ఫిర్యాదులు చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారా? లేక ప్రజలకు ఫిర్యాదు చేస్తున్నారా? ప్రభుత్వంలో ఉన్న మీకు ఇది తప్పు అనిపించడం లేదా? సీబీఐ వాళ్లు న్యూస్‌పేపర్‌లో ఒక యాడ్‌ వేశారు. ఎవరికైనా వివేకా హత్య గురించి సమాచారం తెలిసి, తమకు అందిస్తే రూ.5లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. మా కుటుంబమే హత్య చేసిందని మీరు అంటున్నారు కదా! మేమే చంపినాం అని సీబీఐ వాళ్లకు చెబితే రూ.5లక్షల రివార్డు మీకు వస్తుంది. మీ బాధ్యత మీరు చేయకుండా ఎప్పుడూ మా మీద నిందలు మోపడం ఎందుకు? మీ పని మీరు చేయకుండా ఉండడానికి సిగ్గుగా లేదా?’’ అని సునీత ప్రశ్నించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

అన్నం పెట్టిన చేతినే నరుకుతారా?

‘‘పదేపదే సునీత, సునీత కుటుంబం వివేకాను హత్య చేసింది అంటున్నారు.. జూన్‌ 2019 నుంచి మార్చి 2020 వరకు మీ ప్రభుత్వమే దర్యాప్తు చేసింది కదా? ఆ సమయంలో మమ్మల్ని ఎందుకు అరెస్టు చేయలేదు? ‘సాక్షి’లో రకరకాల కథనాలు రాస్తున్నారు. ‘సాక్షి’ చైర్మన్‌ భారతికి నాదో విన్నపం.. మీ దగ్గర ఆధారాలుంటే, వాటిని దయచేసి దర్యాప్తు సంస్థకు అప్పగించండి. సమాచారం ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే నేరం. సమాచారం తీసుకొని సీబీఐకి ఇవ్వండి. వారి మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్లండి. ఆ రోజు రాత్రి చనిపోయే వరకు, అంటే రాత్రి 11గంటల వరకు వైసీపీ కోసమే వివేకా ప్రచారం చేశారని మీరే అన్నారు కదా! మరి మీకోసం అంత కష్టపడిన వ్యక్తి హత్యకు గురైతే.. ఆ హత్య వెనుక కుట్ర కోణాలు బయటపెట్టాల్సిన బాధ్యత మీకు లేదా? మీకోసం ఆయన పదవిని కూడా త్యాగం చేశారు కదా! మరి ఆ మహానుభావుడిని మరచిపోయారా? ఆయన చనిపోయి ఇన్నాళ్లయినా ఒక్కసారి అయిన ఆయన జయంతికి గానీ ఆయన వర్ధంతికి గానీ ఆయన సమాధి వద్దకు ఒక్కసారి అయినా వచ్చారా? 2019లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మీకు చేసిన మేలును ఒక్కసారి అయినా మాట్లాడారా? గుర్తుచేసుకున్నారా? అన్నం పెట్టిన చేతిని నరకడమే కాకుండా ఆయన కుటుంబాన్ని అడుగడుగునా వేధించడం వారి వ్యక్తిగతం జీవితంపై బురదజల్లడం ఏమిటి?

వైసీపీ నుంచి బయటకు రండి!

‘‘పదవులు త్యాగం చేసిన చిన్నాన్నకు, అన్న కోసం పగలనక రాత్రనక తిరిగిన చెల్లికి వారు ఇచ్చిన కానుకలు చూశాం. వైసీపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు ఒక సలహా ఇస్తున్నా! మీ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం నుంచి బయటకు రండి. లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు’’

నేను కోరేది ఒక్కటే...

‘‘నేను కోరేది ఒకటే. వివేకాకు జరిగింది మరెవరికీ జరగకూడదు. అలా జరగాలంటే ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారందరికీ తప్పకుండా శిక్ష పడాలి. శిక్ష పడితే ఇంకొకరు ఇలాంటి పనులు చేయడానికి భయపడతారు. ఇప్పటికి ఐదేళ్లు పూర్తయింది. ఇంతవరకు పూర్తి సమాచారం రాలేదు. ట్రైల్స్‌ కూడా మొదలు పెట్టలేదు. ఈ కేసు ఇంకా పది సంవత్సరాలు జరగవచ్చేమో! అలా జరగకుండా ఉండాలంటే శాంతిభద్రతలను మన రాష్ట్రంలో సక్రమంగా కొనసాగాలంటే.. అత్యాచారాలు ఆగాలంటే, తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఓటు మనకు ఆయుధం. దయచేసి మా అన్న పార్టీకి ఓటు వేయవద్దు.. ఈ ప్రభుత్వం దిగితే ప్రజా కోర్టులో న్యాయం జరుగుతుంది. అదిచూసి న్యాయస్థానంలో త్వరగా తీర్పురావచ్చు. హంతకులకు ఓటు వేయవద్దు. పార్టీ ముఖ్యం కాదు, నేను నిల్చున్నా నిల్చుకోకపోయినా మన చేతిలోని అస్త్రం ఓటు.. దానిని అందరూ వినియోగించుకోవాలి’’

దేనికోసం పోరాడుతున్నానో.. అదే నేరం మోపుతారా?

‘‘2019 మే 30వ తేదీన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ, ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకూ తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా’నంటూ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణాన్ని చూసి భవిష్యత్తు పట్ల చాలా భరోసా వచ్చిందని సంతోషపడ్డాం. మీ చిన్నాన్నను చంపిన వారికి, చంపించినవారికి శిక్షపడేలా చూసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకు ఉంది. ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు. దర్యాప్తుసంస్థను తన పనిని తాను చేసుకోనివ్వకుండా, మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతోంది. నేరస్థులకు శిక్ష పడేందుకు పోరాటం చేస్తున్న నా మీద, నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు’’ అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి తులసిరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, నాగోతు రమేశ్‌నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, కేవీపీ రామచంద్రరావు, వరదరాజులరెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం పులివెందులలోని వివేకా సమాధి వద్ద ఆయన భార్య సౌభాగ్యమ్మ, డాక్టర్‌ సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ షర్మిల తదితరులు నివాళులు అర్పించారు.

‘‘ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని నాయకులను చూస్తున్నాం. తండ్రి చనిపోయిన దుఃఖంలో, న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు ఉంది. చంపిన వాళ్లను, చంపించినవాళ్లను రక్షిస్తున్న ప్రభుత్వం మరోవైపు ఉంది. మీరు ఎటువైపు ఉంటారు? మన గుండెల్లో అణిగి ఉన్న ఆక్రోశాన్ని, ఆవేశాన్ని మౌనంగా అయినా వెల్లడిరచే అవకాశం వచ్చింది. మీరు నిశ్చయించుకోవాలి. ఒక భవనాన్ని కట్టించేటప్పుడు పునాది చాలా ముఖ్యం. వైసీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. అది వివేకానందరెడ్డి రక్తం, కోడికత్తి శ్రీను రక్తం’’ - సునీత

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !