అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని మరిచి లోక్‌సభ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంస్థాగతంగా పట్టున్న చోట బలమైన అభ్యర్థులను నిలిపేందుకు ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ ఎంపీ స్థానంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను ఆ సీటు నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మారావు పోటీలో ఉంటే గెలుపు పక్కా అని గులాబీ దళపతి ఫిక్సయ్యారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సికింద్రాబాద్‌కి కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ అని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో పద్మారావుగౌడే సరైన ప్రత్యామ్నాయం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిపై పార్టీ అధినేత ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. పద్మారావు గౌడ్‌కు సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు సనత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లోనూ మంచి పేరు ఉండటంతో అభ్యర్థి అయన అయితేనే బాగుటుందని పార్టీలోనూ చర్చ జరుగుతోంది. పార్టీ బలం, గౌడ సమాజికవర్గ ఓట్లు గులాబీ పార్టీని గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, కంటోన్మెంట్, సనత్‌నగర్, ఖైరతాబాద్, నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో నాంపల్లి మినహా మిగతా అన్ని సీట్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలను రిపీట్ చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.