పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని మోదీ ఇటీవల మల్కాజ్‌గిరిలో జరిగిన రోడ్ షో ఎన్నికల శంఖరావం పూరించిన విషయం తెలిసిందే. సౌత్ మిషన్ ఆపరేషన్ లో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు విడుతలుగా తెలంగాణ పర్యటించిన మోదీ తాజాగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగమైన జగిత్యాల బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందనీ, బీఆర్‌ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు తనను దూషించడమే ధ్యేయంగా పెట్టుకున్నాయని మోడీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఉద్దేశించి అన్నారు. తెలంగాణను దోచుకున్నవారిని ఎవరినీ వదలం అంటూ మోడీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోలింగ్ రోజు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో బీజేపీ ప్రభంజనం కనిపిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రక్షాళన అవుతాయని వ్యాఖ్యానించారు. పొరుగున ఉన్న కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంపై కూడా ఈ సభ ప్రభావం చూపుతుందని మోదీ భావిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 లోక్ సభ స్థానాలకుగాను నాలుగింటిని గెలుచుకున్న ఆ పార్టీ దక్షిణాదిలో పట్టు సాధించేందుకు ప్రస్తుత బలం పెంచుకోవాలని చూస్తోంది. గతవారం హైదరాబాద్ లోని మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన మోడీ.. నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ పర్యటన అనంతరం ఆయన కర్ణాటకలోని బహిరంగ సభ హాజరుకానున్నారు.
మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర లిఖించబోతున్నారు
తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ మాట్లాడుతూ.. ‘నేను భరతమాత పూజారిని. నాకు ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తుంది. శక్తి స్వరూపిణిలైన ఇంతమంది స్త్రీలు, యువత ఆశీర్వచనం ఇచ్చేందుకు వచ్చారంటే.. నేనెంత అదృష్టవంతుణ్ని’ అని అన్నారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని, వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని అన్నారు. బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొట్టుకుపోతాయన్నారు. బీజేపీకి ఓటు వేయాలి.. 400 సీట్లు దాటాలన్నారు. దేశమంతా ఆదరించే శక్తిని నాశనం చేయాలని విపక్షకూటమి భావిస్తోందని, శక్తిని నాశనం చేయడం ఎవరి వల్ల కాదని మోదీ స్పష్టం చేశారు.
నారీశక్తి అంతా ఒకేతాటిపైకి రావాలి
భారత్ వికాసంతో తెలంగాణా వికాసం కూడా సులభమైతుందని చెప్పారు. మూడురోజుల్లో మూడుసార్లు తెలంగాణా వచ్చానన్న మోదీ.. వందల కోట్లు తెలంగాణా వికాసం కోసం కేంద్రం కేటాయిస్తుందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఊసే లేదని, తెలంగాణతో పాటు, దేశం మొత్తం మళ్లీ బీజేపీనే కావాలని కోరుతోందని తెలిపారు. సమృద్ధ భారత్ కోసం 400 సీట్లు దాటాలని, అందుకే బీజేపీకే ఓటు వేయాలన్నారు. ఇండియన్ అలయెన్స్ కు నామారూపాల్లేకుండా చిత్తు చేసేందుకు ఈ నారీశక్తి అంతా ఒక్క తాటిపైకి రావాలని కోరారు. చంద్రయాన్ సఫలీకృతం కావడంలో కూడా ఈ నారీశక్తిది కీలకపాత్ర పోషిందని చెప్పారు.
ఆ రెండు పార్టీలకు తెలంగాణ ఏటీఎం కార్డులా మారింది
శక్తి వినాశనాన్ని కోరుకునే వారికి ఇక్కడ స్థానం లేదని, వారిని తుదముట్టించాలన్నారు. తెలంగాణా ప్రజల కలలను నిర్వీర్యం చేసిన ప్రజా ఘాతకులు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ నాయకులని మోదీ విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం కార్డులా మారిందన్న ఆయన తెలంగాణను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూదొందేనని దుయ్యబట్టారు. అందుకే కాళేశ్వరంకు సంబంధించి ఎలాంటి చర్యల్లేవని మోదీ మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు మోదీని తిట్టడం, మోదీ జపం చేయడం మాత్రమే చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కాదది.. స్కాంగ్రెస్
మోదీ తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నాడని, తెలంగాణను దోచుకునే వారినెవరినీ వదిలిపెట్టడనని చెప్పారు. కాంగ్రెస్ కాదది.. స్కాంగ్రెస్ అంటూ నిప్పులు చెరిగారు. ఢల్లీిలో లిక్కర్ స్కాంతో ఇక్కడి బీఆర్‌ఎస్ ఏం చేసిందో చూశారు.. ఆ రెండు పార్టీలను గెలిపిస్తే అంతే సంగతులన్నారు. మీరెన్ని సీట్లలో తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే.. తెలంగాణలో అంత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
రాహుల్ చాలెంజ్ స్వీకరిస్తున్నా.. శక్తి ఎవరిదో జూన్ 4న తెలుస్తుంది
శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ గాంధీ చాలేంజ్‌ను తాను స్వీకరిస్తున్నాని మోదీ తెలిపారు. శక్తి ఎవరికి ఉందో జూన్ 4న తెలుస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకరినొకరు సహకరించుకుంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌పై అవీనీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు అవే ఆరోపణలు బీఆర్‌ఎస్ చేస్తోందని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే.. వాటి అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే మోదీని తిడుతారని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 400 సీట్లు అంటున్నారని, రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతుందన్నారు.