దేశంలో తొలి బుల్లెట్ రైలు ఎప్పడు పట్టాలపైకి వస్తుందనే విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. 2026 నాటికి ఈ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందన్నారు. ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. ‘‘బుల్లెట్ రైలు కోసం 500కి.మీల ప్రాజెక్టును నిర్మించేందుకు వివిధ దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. కానీ, భారత్ 8-10 సంవత్సరాల్లోనే దాన్ని పూర్తిచేయనుంది. అది కూడా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో. 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కనుంది. మొదట గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీనిని నడపనున్నాం. 2028 నాటికి ముంబయి-అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడిరచారు. జపాన్ షింకన్‌సెన్ టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తున్నది. రూ.1.10 లక్షల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని భావించినప్పటికీ భూసేకరణలో అడ్డంకులు ఎదురయ్యాయి. 2026 నాటికి దక్షిణ గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య మొదటి దశ బుల్లెట్ రైలును నడపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్న అహ్మదాబాద్-ముంబయి మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు.
డిసెంబరు నాటికి చిప్..
ఈ ఏడాది డిసెంబరు నాటికి తొలి మేడిన్ ఇండియా చిప్ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి ఈ సందర్భంగా వెల్లడిరచారు. ‘‘వికసిత్ భారత్‌కు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం చాలా కీలకమైనది. రానున్న ఐదేళ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో టాప్-5 దేశాల్లో భారత్ నిలుస్తుందని మేం విశ్వాసంగా ఉన్నాం. అమెరికా చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీతో ఒప్పందం జరిగింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి మన దేశంలోని ఈ ప్లాంట్ నుంచి తొలి మేడిన్ ఇండియా చిప్ రానుంది. గుజరాత్‌లోని ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ 2026 డిసెంబరు నాటికి చిప్‌లను ఉత్పత్తి చేయనుంది’’ అని వైష్ణవ్ వెల్లడిరచారు.