ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, నేతలు చేయాల్సినవి, చేయకూడని పనులు ఏంటి అన్నది ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిర్దేశిస్తుంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు గానూ ఎన్నికల సంఘం కొన్ని నియమాలను రూపొందించింది. ఎన్నికల ప్రచారం మొదలుకొని.. పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియామవళికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకటించిన తేదీ మొదలు.. ఫలితాలు వెలువడే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది.
ఏమిటా నియమాలు?
- కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ప్రచారంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసేలా విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, స్కీములు ప్రకటించకూడదు.
- అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాధనాన్ని వినియోగించకూడదు. పత్రికల్లో గానీ, ఇతర మాధ్యమాల్లో గానీ ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు.
- మంత్రులు ఎన్నికల ప్రచారంలో అధికారిక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్ లైట్లు కలిగి ఉన్న పైలట్ కార్లు (బుగ్గ కార్లు), తమ ఉనికిని తెలిపేలా సైరన్ ఉన్న వాహనాలను కూడా వాడకూడదు.
- ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎటువంటి నియామకాలు కూడా చేపట్టకూడదు.
- రాజకీయ నేతలు ప్రత్యర్థి పనితీరుపై విమర్శలు చేయొచ్చు. కానీ, వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. అలాగే, కులం, మతం పేరుతో దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం నియామావళికి వ్యతిరేకం.
- దేవాలయాలు, మసీదులు, చర్చిలు.. ఇలా ఏ ప్రార్థనా మందిరాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదు. ఓటర్లను ప్రలోభం పెట్టడం, వారిని బెదిరించడం వంటివి కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయి.
- కులాల మధ్య, మతాల మధ్య, వివిధ భాషలు మాట్లాడే వారి మధ్య చిచ్చు పెట్టడం కోడ్ ఉల్లంఘనే అవుతుంది.
- రాత్రి 10 తర్వాత బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.
- రాజ్యాంగంలోని ఆదర్శాలకు విరుద్ధంగా మ్యానిఫెస్టో ఉండకూడదు. పార్టీలు ఇచ్చే హామీల్లో హేతుబద్ధత ఉండాలి.
- ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు తమకు ఓటేయాలంటూ ప్రచారం నిర్వహించకూడదు. పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రభావితం చేయూడదన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిబంధన విధించింది.
- పోలింగ్ తేదీ రోజు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కూడా నేరంగా పరిగణిస్తారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లకు సొంత వాహనాల్లో ఓటర్లను తరలించకూడదు.
- సాధారణంగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువ. ఎన్నికల సమయంలో పార్టీలు నగదు తరలించడానికి వేర్వేరు మార్గాలను అనుసరిస్తుంటాయి. కోడ్ సమయంలో ఒకవేళ పౌరులు అధిక మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులను తీసుకెళ్లాల్సి వస్తే.. వాటికి సంబంధించిన బిల్లులను వెంట తీసుకెళ్లడం మంచిది