గత కొన్ని రోజులుగా కోలీవుడ్ హీరో సిద్దార్థ్, బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావు హైదరీల రిలేషన్‌పై వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహా సముద్రం’ కోసం సిద్ధార్థ్, అదితి తొలిసారి కలిసి వర్క్ చేశారు. అప్పటి నుండి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదని.. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. ఆ మధ్య హీరో శర్వానంద్ వివాహ వేడుకకు ఇద్దరూ కలిసి వెళ్లడం కూడా వీరి రిలేషన్‌పై వార్తలు వైరల్ అయ్యేలా చేసింది. ఇప్పుడీ రిలేషన్‌ని వారు ఇంకాస్త ముందుకు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. సిద్దార్థ్, అదితి రావు హైదరి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరి రహస్య వివాహానికి సంబంధించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పెళ్లిపై వార్తలు రావడంతో సిద్ధార్థ్ అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లి
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం శ్రీరంగపురం గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో సిద్దార్థ్, అదితి రావులు బుధవారం ఉదయం రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రహస్యంగా జరిగిన ఈ పెళ్లి తంతు కార్యక్రమానికి మీడియాతో పాటు ఆలయ సిబ్బందిని కూడా టెంపుల్‌లోకి రానివ్వలేదనేలా వార్తలు వినబడుతున్నాయి. ఈ పెళ్లికి వీరిద్దరికీ చాలా దగ్గరైన వారు మాత్రమే హాజరైనట్లుగా సమాచారం. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితి రావు హైదరి కూడా ఒకరు. అందుకే ఆమె ఆ సంస్థానానికి చెందిన దేవాలయంలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పురోహితుల సమక్షంలో పూర్తి ఆంక్షలతో సిద్దార్థ్, అదితిల వివాహం జరిగిందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివాహానికి సంబంధించి సిద్దార్థ్, అదితిల నుంచి ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సిద్ధార్థ్‌కు ఇది రెండో వివాహం. గతంలో మేఘన అనే మహిళతో పెళ్లి జరిగింది. 2007లో వీరిద్దరూ విడిపోయారు. ఆదితికి కూడా ఇది రెండో వివాహమే. గతంలో సత్యదీప్ మిశ్రాతో వివాహం కాగా.. 2012లో విడాకులు తీసుకున్నారు.