విశాఖలో డ్రగ్సా ? కిలో, 2 కిలోలు కాదు ఏకంగా 25వేల కేజీలు ? అది కూడా బ్రెజిల్ నుంచి తరలింపా? ఎవరు పంపారు? ఎవరికి పంపారు? ఏ డెలివరీ అడ్రస్‌తో వచ్చింది? ఎవరిదీ ఆ ప్రైవేట్ ఆక్వా కంపెనీ. ఈ సమాధానం లేని ప్రశ్నలు ఇప్పుడు విశాఖతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠతో ఎదరుచూస్తున్నాయి. అసలు ఇంతకీ ఆ వివరాలు ఏంటంటే.? విశాఖపట్నం తీరంలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌లో 25 వేల కేజీల డ్రగ్స్‌ను గుర్తించింది సీబీఐ. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న కంటైనర్ విశాఖకు వచ్చినట్లు గుర్తించారు. ప్రాధమిక పరీక్షలు చేసి డ్రై-ఈస్ట్‌తో మిక్స్ చేసి వెయ్యి బ్యాగ్‌ల్లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ప్యాక్ చేసినట్టు కనిపెట్టింది. ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో షిప్ కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ వచ్చేదాకా ఎదురుచూసింది సీబీఐ. ఆపరేషన్ ‘గరుడ’ పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టిన సీబీఐ.. విశాఖ తీరానికి వచ్చీరాగానే మొత్తం కంటైనర్‌ని సీజ్ చేసింది. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆక్వా కంపెనీ అడ్రస్‌తో డెలివరీ చేసేందుకు యత్నించినట్టు తేల్చింది. కాగా, అడ్రస్ ఆధారంగా కేసు నమోదు చేసిన సీబీఐ.. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టింది.
ఆపరేషన్ గరుడ గురించి..
విదేశాల నుంచి దేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తోన్న ముఠాలను అరికట్టేందుకు సీబీఐ ప్రారంభించిన సమగ్ర ఆపరేషన్ ఈ ‘ఆపరేషన్ గరుడ’. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇంటర్‌పోల్ సమన్వయ సహకారంతో సీబీఐ ఈ ఆపరేషన్ గరుడను విజయవంతంగా సాగిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాను చేస్తున్నాయి ముఠాలు. వాటిని అరికడుతూ.. ఆ ముఠాల ఆటలు కట్టిస్తోంది సీబీఐ.