Congress : కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు...1823 కోట్లు పెనాల్టీ !

0

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి ఐటీ విభాగం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా శుక్రవారం వెల్లడిరచారు. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1823 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తమపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం తాజా నోటీసులిచ్చినట్లు వివేక్‌ తంఖా ఆరోపించారు. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్‌ చేస్తామని పేర్కొన్నారు.

జోక్యానికి నో ! 

2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతకుముందు 2014-15 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన పునఃపరిశీలనను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా ఇవే కారణాలతో దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పునఃపరిశీలనకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి రూ.135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసింది.

కాంగ్రెస్‌ని నిలువరించేందుకే 

సార్వత్రిక ఎన్నికల వేళ రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు రావడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఈ కీలక సమయంలో తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక సమయంలో ఐటీ శాఖను తమపై ప్రయోగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడిరది. ఇప్పటికే రూ.135 కోట్లు తమ ఖాతా నుంచి బలవంతంగా తీసుకున్నారని.. తాజాగా మరో 1,823.08 కోట్లు చెల్లించాలంటూ నిన్న నోటీసులు ఇచ్చారని పేర్కొంది. ఈ ఆర్థిక ఉగ్రవాదాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో శనివారం (మార్చి 30న) పెద్దఎత్తున నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్న కాంగ్రెస్‌.. ఈ పన్ను ఉగ్రవాదాన్ని నిరసిస్తూ అన్ని పీసీసీల ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సూచించింది. సీనియర్‌ నేతలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరుతూ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అభ్యర్థుల సమక్షంలో నియోజకవర్గాల్లోనూ నిరసనలు చేపట్టాలని సూచించారు.  నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమంటే ఇదేనా? ఎన్నికల సంఘం ఎందుకు మౌనప్రేక్షకుడిలా ఉంటోంది? బీజేపీపై కూడా ఇదేరకమైన చర్యలు తీసుకుంటే వాళ్లు రూ.4,600 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ, వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ఐటీ అధికారుల్ని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని.. ఈ చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !