యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్‌ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వృధా ప్రయాసగానే మిగులుతోంది. డ్రగ్స్ వినియోగం చాపకింద నీరులాగా వ్యాపిస్తూనే ఉంది. కొన్ని ముఠాలు రహస్యంగా ఈ చీకటి దందాని నడిపిస్తూనే ఉన్నాయి. తమ జేబులు నింపుకోవడం కోసం విద్యార్థుల జీవితాలతో డ్రగ్స్ ముఠాలు చెలగాటమాడుతున్నాయి. వారిని మత్తుకి బానిసలు చేసి జీవితాలను నాశనం చేస్తున్నాయి. చివరికి మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నాయి. మాయమాటలతో పిల్లలను డ్రగ్ రాకెట్‌లోకి లాగి, వారి చేత అసభ్యకరమైన పనులకు పాల్పడేలా పురిగొల్పుతున్నాయి. ఇలాంటి షాకింగ్ ఘటన తాజాగా జగిత్యాలలో వెలుగు చూసింది.
పేద ఆడపిల్లలే టార్గెట్ !
ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10 మంది బాల బాలికలను ట్రాప్ చేసి, వారికి గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు అలవాటు చేసి, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లి రేవ్ పార్టీల్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. జగిత్యాల శివారు చల్గల్కు చెందిన కొందరు ముఠా సభ్యులు, పాఠశాలలో చదువుకునే మగ పిల్లల ద్వారా మత్తు పదార్థాలు స్కూళ్లోకి చేరవేస్తున్నారు. ఆపై ఆడ పిల్లలకు వాటిని అలవాటు చేసినట్లు తెలుస్తోంది. ఇలా మత్తు పదార్థాలకు బానిసలైన జగిత్యాల పట్టణానికి చెందిన బాలికలను ఇటీవల హైదరాబాద్‌లోని ఓ రేవ్ పార్టీకి కూడా తీసుకెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కరీంనగర్‌లోని స్వధార్ హోమ్‌లో ఆశ్రయం పొందుతున్న బాలిక, మొదట్లో తీవ్ర మత్తులో ఉండేదని, మానసికంగా కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యేదని హోమ్ నిర్వాహకురాలు తెలిపారు. డ్రగ్స్ ముఠాలు పేదింటి ఆడ పిల్లలను ట్రాప్ చేసి, ఇలాంటి కూపంలోకి దించుతున్నాయని స్వధార్ హోమ్ నిర్వాహకురాలు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే గంజాయి, డ్రగ్స్, వ్యభిచార ముఠాలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఈ విషయంలో ఇప్పటికే జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగి, ముఠా కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు సమాచారం.
ప్రవర్తనలో మార్పు !
ఓ తండ్రి చేసిన ఫిర్యాదుతో ఒళ్లు గగుర్పొడిచే ఈ డ్రగ్స్ బాగోతం బయటపడిరది. జగిత్యాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కొన్ని రోజుల నుంచి వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మొదట్లో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అంతగా ఖాతరు చేయలేదు. అయితే.. ఈమధ్య అమ్మాయి మరింత విచిత్రంగా వ్యవహరిస్తుండటంతో తండ్రికి అనుమానం వచ్చింది. ఎందుకిలా ప్రవర్తిస్తోందని ఆరాతీయగా.. ఆమె గంజాయికి అలవాటు పడిరదని తండ్రికి తెలిసింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శిశు సంరక్షణ కమిటీ.. వెంటనే దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో భాగంగానే మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అమ్మాయితో పాటు పదో తరగతి చదువుతున్న ఇతర విద్యార్థినులు సైతం మత్తుకు బానిసైనట్లు తేలింది. మొత్తం 10 మంది బాలికలు గంజాయికి బానిసైనట్లు తెలిసింది. అసలు ఈ అమ్మాయిలకు ఎక్కడి నుంచి గంజాయి అందిందని మరింత లోతుగా విచారించగా.. దీని వెనుక ఓ సెక్స్ రాకెట్ ముఠా ఉన్నట్టు వెలుగులోకొచ్చింది. ఆ బాలికలను గంజాయికి బానిసలను చేయడమే కాదు.. వారిని హైదరాబాద్‌లోని రేవ్ పార్టీలకు కూడా తరలించి వ్యభిచారం చేయిస్తునట్లు తెలిసింది. అలా తరలించినందుకు గాను.. ప్రతి పార్టీకి రూ.30 వేలు ఆ ముఠాకు అందుతున్నట్టు తెలిసింది. ఈ తరుణంలోనే నార్కొటిక్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. సెక్స్ రాకెట్ ముఠాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు.. మత్తుకు బానిసైన విద్యార్థినులను స్వధార్ హోంకు తరలించారు. ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల ఈ పరిస్థితికి కారణమైన వారిని శిక్షించాలని కోరుతున్నారు.