కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ఓ అసమర్థ నేత అని, ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గడం ఆయన తరం కాదని వ్యాఖ్యానించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా ముంబైలో జరిగిన బహిరంగ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. తాము ఓ శక్తితో పోరాడుతున్నామని అన్నారు. ఈవీఎం, దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖలను అడ్డం పెట్టుకొని విపక్షాలను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవడానికి పార్టీ మారారని అన్నారు. తాను పేర్లు చెప్పదలుచుకోలేదని మహరాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నాయకుడు కాంగ్రెస్‌ను విడిచిపెట్టారని అన్నారు.
కేసుల పేరుతో బెదిరిస్తున్నారు.
ఆయన ఏడుస్తూ తన తల్లి సోనియా గాంధీకి ఫోన్ చేసినట్లు చెప్పారు. ‘సోనియాజీ.. ఆ శక్తితో పోరాడే శక్తి నాకు లేదు. నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారని రాహుల్ వివరించారు. ఇలా వారు వేలాది మందిని బెదిరించారంటూ రాహుల్ ఆరోపించారు. కాగా, గత నెలలో బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. మనం అధికారంతో పోరాడుతున్నాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు కొందరు ఇటీవల భాజపాలో చేరారు. వారిలో మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్‌రా శివసేన(శిందే వర్గం)లో చేరారు. 48 ఏళ్లుగా పార్టీలో ఉన్న బాబా సిద్ధిక్ కాంగ్రెస్ నుంచి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మణిపుర్‌లోని తౌబాల్ జిల్లాలో జనవరి 14న భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 100కిపైగా జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాల మీదుగా కొనసాగింది. 63 రోజుల అనంతరం ముంబయి చేరుకుంది. ఆదివారం ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి ‘ఇండియా’ కూటమికి చెందిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ గైర్హాజరయ్యారు. ఈ సభపై భాజపా విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌తో నిలబడాలని ఎవరూ కోరుకోరని ఎద్దేవా చేసింది.