TPCC : కాంగ్రెస్‌లో నిజమైన వాదులకు అన్యాయం జరగుతోందా ?

0

కష్టకాలంలో కాంగ్రెస్‌ని భుజాలపై మోసిన వాళ్ళకి గుర్తింపు లేదా అంటే అవును నిజమే అని కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ని కాదనుకుని కాంగ్రెస్‌కి పట్టం కట్టిన్న ప్రజల తీర్పు మీద కాంగ్రెస్‌ నాయకులకు చిన్న చూపు కనిపిస్తుంది. కాంగ్రెస్‌ నాయకులు ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అని అతివిశ్వాసం కాబోలు. బీఆర్‌ఎస్‌లో అధికారంలో ఉన్నన్నాళ్ళు పదవులు వెలగబెట్టి, ఆ పార్టీ అధికారం కోల్పోగానే ఎగబడి మరీ అధికార పార్టీలోకి దిగుమతి అవుతుంటే ఏమనుకోవాలి. దానికి ఎదురేగి మరీ స్వాగతం పలుకుతున్న అధినాయకుల తీరును ఏమని ప్రశంసించాలి. రాజకీయ అవసరాల కోసం,  అవినీతి, అక్రమసొమ్మును కాపాడుకోవటం కోసం, కేసుల నుండి విముక్తి పొందటం కోసం రాజకీయ వలస పక్షులు అధికార పార్టీ అడుగులు వేస్తున్నాయని స్వయానా కాంగ్రెస్‌ నాయకులే వాపోతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని నిర్విర్యం చేస్తున్నామని పాలకులు భావిస్తున్నారు. కానీ మరో వైపు కాంగ్రెస్‌ని నిలబెట్టిన కార్యకర్తలు,నాయకులకు అన్యాయం జరుగుతుందని ఎందుకు గ్రహించలేకపోతున్నారు. ఇంకా ఎన్నాళ్ళు...త్యాగాలు చేయాలి. పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ అదే వలస నాయకుల క్రింద పనిచేయడానికి అసలైన కాంగ్రెస్‌ వాదులకు ఆత్మగౌరవం అడ్డువస్తోంది. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిని ప్రకటించింది హస్తం పార్టీ. మరో వైపు సిక్రింద్రాబాద్‌ స్థానానికి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే  దానం నాగేందర్‌కు టికెట్‌ ఇచ్చారు. మరోవైపు మల్కాజిగిరి స్థానం నుంచే గత ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి ఎంపీగా గెలిచారు. కానీ మళ్ళీ ఈ స్థానం నుండి పార్టీ సీనియర్లను, సమర్థులను కాదని సునీతా మహేందర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. ఈ పరిణామాలతో అసలైన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎంత చేసిన విలువ లేదని వలస నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని వాపోతున్నారు. 

బీసీ డిక్లరేషన్‌ ఎటుపోయింది !

అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేసి.. సామాజిక న్యాయం చేస్తామని రాహల్‌ గాంధీ చెబుతుంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని వీహెచ్‌ వంటి సీనియర్లు వాపోతున్నారు. మరోవైపు బీజేపీ ఐదు స్థానాలు, బీఆర్‌ఎస్‌ ఆరు స్థానాలు బీసీలకు కేటాయించాయి. దీంతో కాంగ్రెస్‌ పై కూడా బీసీ నేతలు మెజారిటీ సీట్లు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌ ఇప్పటివరకు తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రెండు ఎస్సీ, ఒకటి ఎస్టీ రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా ఆరు స్థానాల్లో కేవలం రెండు మాత్రమే బీసీలకు కేటాయించింది. జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌, సికింద్రాబాద్‌ నుంచి దానం నాగేందర్‌లకు అవకాశమిచ్చింది అధిష్టానం.. ఇంకా ఎనిమిది స్థానాలు పెండిరగ్‌లో ఉండటంతో  వీటిలో కనీసం నాలుగు స్థానాలు బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు నేతలు. కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే బీసీలకు మరో మూడు చోట్ల అవకాశం కల్పించాలని నేతలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఖమ్మం టికెట్‌ కోసం సీనియర్‌ నేత వి.హనుమంతరావు డిమాండ్‌ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీసీకి కూడా టికెట్‌ ఇవ్వలేదని..ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే భువనగిరి నుంచి పున్న కైలాష్‌ నేత, క్యూన్యూస్‌ అధినేత తీన్మార్‌ మల్లన్న టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీలకు టికెట్‌ ఇస్తే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్‌ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. నిజామాబాద్‌ నుంచి బీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు టికెట్‌ ఇవ్వాలని పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ సూచిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటు లోక్‌సభ ఎన్నికల్లోనే న్యాయం జరగాలనే బీసీ నేతల బిగ్‌ డిమాండ్‌పై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !