Tamilisai : రాజ్యాంగబద్ధ పదవులకు తమిళసై రాజీనామా !

0


తెలంగాణ గవర్నర్‌ పదవి, పుదుచ్చేరి ఎల్జీ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. 2019 సెప్టెంబర్‌ 8న ఆమె తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. కాగా.. గవర్నర్‌ రాజీనామా విషయాన్ని సోమవారం రాజ్‌ భవన్‌ అధికారికంగా దృవీకరించలేదు.. అయితే, తమిళిసై లోక్‌ సభ ఎన్నికల్లో కన్యాకుమారి, చెన్నై సౌత్‌, తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. కన్యాకుమారి.. తమిళిసై సొంత జిల్లా.. అంతేకాకుండా కన్యాకుమారి, తిరునల్వేలిలో అధికంగా నాడార్‌ ఓటు బ్యాంక్‌ ఉండటంతో.. వీటిలోని ఏదో ఒక స్థానంలో తమిళిసై పోటీచేయనున్నట్లు చెబుతున్నారు. గవర్నర్‌ పదవికి రాజీనామా నేపథ్యంలో తమిళిసై సౌందరరాజన్‌ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్త కథనాలు వెలువడుతున్నాయి. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై తమిళనాడులోని తూత్తుకుడి లేదంటే విరుదునగర్‌ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగింది.ఈ క్రమంలోనే గవర్నర్‌ తమిళిసై తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. తెలంగాణ గవర్నర్‌ పదవితోపాటు పుదుచ్చేరి ఎల్జీ పదవికి రాజీనామా చేస్తూ లేఖను పంపినట్లు తెలుస్తోంది.

తమిళిసై రాజకీయ జీవితం..

1999లో బీజేపీలో చేరిన తమిళిసై.. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీచేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళిసైను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్‌గా పంపింది. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి ఇన్‌చార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. కాగా, తమిళిసై తండ్రి కమరి ఆనంద్‌ తమిళనాడు కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !