తెనాలికి చెందిన గీతాంజలి మరణానికి కారకులెవరు..? ఇప్పుడు ఈ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని గీతాంజలి భర్త చెప్తున్నారు.. అంతే కాదు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేశారు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సిఎం ఆదేశాలతో ఇవాళ ఆమె నివాసానికి వైసీపీ నేతలు పరమర్శించి వెళ్తున్నారు. విపరీతమైన ట్రోలింగ్‌తో వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. స్థానిక ఎమ్మేల్యేతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. కాగా.. నాలుగు రోజుల క్రితం రైలు పట్టాలపై కొనఊపిరితో ఉన్న గీతాంజలి.. నిన్న ప్రాణాలు వదిలే వరకూ ఏం జరిగింది.. ఈ ట్రోలింగ్ వెనుక ఏం జరిగింది అనేది ఓసారి చూస్తే..
ట్రోలింగ్‌తో మానసిక వేదన
ఇటీవల అంటే ఈనెల 4న ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా తీసుకుంది గీతాంజలి. తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో అధికారులు గీతాంజలికి ఇంటిస్థలం పట్టా అందజేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ తో ఆమె మాట్లాడిన మాటలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని, స్వంత ఇళ్లు అనేది అందరి కల అని, ఇళ్ల స్థలం పొందడం ద్వారా తన కల నెరవేరిందంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడిరది. తన పిల్లలకు అమ్మ ఒడి కూడా వస్తోందని, ఇన్ని మంచి పనులు చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను మళ్లీ గెలిపించుకోవడం తమ బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు అభిమానుల సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. గీతాంజాలి ఓ పెయిడ్ అర్ట్స్టి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ వచ్చారు. సోషల్ మీడియా మానసిక వేదన భరించలేకే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం గీతాంజలి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిరదంటూ చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఆమె సంతోషం... అంతలోనే విషాదంగా మారటం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలి అసలు పేరు గీతాంజలి దేవి. తెనాలిలో నివాసం ఉంటుంది. ఆమె వయసు 29 ఏళ్లు. ఈమె భర్త బాలచంద్ర. బంగారం పని చేస్తుంటాడు. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే గీతాంజలికి సొంతిల్లు ఉండాలని ఎప్పటినుంచో కల.. ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది. అనంతరం గీతాంజలి మరణంతో ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. తనకు అమ్మఒడి అందిందని, కుటుంబ సభ్యులకు మిగతా పథకాలు కూడా అందుతున్నాయని చెప్పినందుకే ఇలా ట్రోల్ చేస్తారా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెనాలిలో గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్ అయింది.. గీతాంజలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ సభ్యుడు మారేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే, స్థానిక పోలీసులతో మాట్లాడిన మారేష్ కుమార్.. సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసిన వారిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.