చిన్నారుల్లో సమగ్ర వికాసాన్ని ఆశించే తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఫీజుల భారం నుంచి ఉపశమనం ఒకటైతే.. ఇక్కడ చేర్పిస్తే ప్లస్ 2 వరకు నిశ్చింతగా చదువుకోవచ్చన్న విశ్వాసం మరో కారణం. ఈ విద్యా సంస్థల్లో సీటు రావడం చాలా కష్టమైనప్పటికీ, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండటంతో తమ పిల్లల్ని ఒకటో తరగతిలో చేర్పించాలనుకొనేవారు కేంద్రీయ విద్యాలయ ప్రవేశ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిల్లల్ని ఒకటో తరగతిలో చేర్పించాలని చూస్తోన్న తల్లిదండ్రుల కోసం ఈ విశేషాలు..
- కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కింద దేశవ్యాప్తంగా 1,254 పాఠశాలలు ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధితో కూడిన విద్యనందించడమే లక్ష్యంగా ఈ పాఠశాలలు పనిచేస్తాయి. ఇక్కడ కేవలం విద్యకే పరిమితం కాకుండా ఆటలు, ఇతర కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
- కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతిలో చేరాలంటే పిల్లల వయసు కనీసం ఆరేళ్లు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్న విద్యార్థుల అడ్మిషన్ ఫారమ్‌లను తిరస్కరిస్తారు. ఏప్రిల్ 1 నాటికి ఆరేళ్లు నిండిన విద్యార్థుల దరఖాస్తులను మాత్రమే ఆమోదిస్తారు. 9, 11 తరగతుల్లో నమోదు చేసుకొనే విద్యార్థులకు కనీస లేదా గరిష్ఠ వయోపరిమితి ఏమీ లేదు.
- ప్రవేశ దరఖాస్తుల్లో ఏ చిన్న లోపం ఉన్నట్లు పరిశీలనలో తేలినా అడ్మిషన్ నిరాకరిస్తారు. అందుకే దరఖాస్తు నింపేటప్పుడు తప్పుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నారైల నుంచి దరఖాస్తులను స్వీకరించరు. మన దేశంతో పాటు కాఠ్‌మాండూ, మాస్కో, టెహ్రాన్‌లలోనూ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇవన్నీ సీబీఎస్‌ఈ (%జదీూజు%) అనుబంధ పాఠశాలలే.
- 2024-25 విద్యా సంవత్సరానికి ఇంకా ప్రవేశాలు ప్రారంభం కాలేదు. మార్చి చివరి వారంలో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 27 నుంచి ఏప్రిల్ 17 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. దాన్నిబట్టి చూస్తే ఈసారి కూడా దాదాపు మార్చి చివరి వారంలోనే దరఖాస్తుల ప్రక్రియ షురూ అయ్యే అవకాశం ఉంది. తరగతుల వారీగా ఉండే నామమాత్రపు ఫీజులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు తదితర అప్‌డేట్స్‌ను తల్లిదండ్రులు కేవీ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/లో తెలుసుకోవచ్చు.
- తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 70 కేవీలు ఉండగా.. ఏపీ, తెలంగాణలలో చెరో 35 చొప్పున కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ స్కూళ్లను తొలుత భారత రక్షణ దళాల్లోని సైనికుల పిల్లల కోసం స్థాపించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ ప్రజలకు సైతం అవకాశం కల్పిస్తున్నారు.
- దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఒకేరకమైన సిలబస్‌ను అనుసరించడం వల్ల బదిలీ అయ్యే ఉద్యోగుల పిల్లలకు చదువులో ఇబ్బంది తలెత్తదు.