పిఠాపురం నుంచి ఈసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయ్యింది. పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కలిసొచ్చే ప్రతీ అంశాన్ని పరిశీలిస్తోంది. కలిసొచ్చే అన్నీ శక్తులను కలుపుకుపోతుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. పవన్ కళ్యాణ్‌ను ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టనీయ కూడదనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సారి పవన్‌కళ్యాణ్ ఓడిపోతే అదీ ఒక మహిళ చేతిలో ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు. ఈ సారి ఎన్నికలు పవన్ కళ్యాణ్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం. గెలిచి తీరాల్సిందే. ఒక నాయకుడే గెలిచే పరిస్థితి లేకపోతే అనుచరులు, క్యాడర్ కూడా నిర్విర్యం అయిపోతుంది. దీన్ని పసిగట్టిన జగన్ తీరిగ్గా పిఠాపురంపై ఫోకస్ పెట్టారు. పవర్‌స్టార్‌కి చెక్ పెట్టేందుకు కులాల సమీకరణతో పాటు కాపు కుల పెద్దలను రంగంలోకి దించారు. ముద్రగడ పద్మనాభాన్ని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. వంగా గీతను అభ్యర్థిగా బరిలో నిలిపారు.
అసమ్మతి వినిపించకుండా జాగ్రత్తలు
మరోవైపు గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారికి పిఠాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబును ప్రస్తుతానికి పక్కన బెట్టేశారు. అయితే దొరబాబు వర్గం నుండి వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో అసమ్మతి వినిపించకుండా చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబును బుజ్జగించి వంగా గీతకు సహకరించే విధంగా కసరత్తులు చేపట్టారు. ముందుగా పెండెం దొరబాబును తన కార్యాలయానికి పిలిచించారు. ఈ భేటీలో వంగా గీత వర్గంతో సమన్వయం చేసుకునేలా దొరబాబును ఒప్పించారు. భవిష్యత్తులో పదువులు అందించేందుకు హామీ ఇచ్చారు. మరోవైపు పార్టీలో చేరికలకు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడంపైనా సీఎం జగన్ ఆరా తీశారు. వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు వర్గాలు కలిసి పని చేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ మేరకు పెండెం దొరబాబుతో భేటీ అయి వచ్చే ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా పవన్ కల్యాణ్‌పై గెలిచేందుకు వైసీపీ నాయకులంతా ఒకటిగా పని చేయాలని పెండెం దొరబాబుకు సీఎం జగన్ సూచించారు.
మంగళగిరిలో లోకేష్‌కు సేమ్ స్కెచ్ !
సామాజిక సమీకరణలను సెట్ చేయటంలో జగన్‌ను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నారా లోకేష్ రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు సామాజిక సమీకరణలతో ముందుకు కదులుతున్నారు. రాజకీయ నేపథ్యం గల కుటుంబాన్ని అన్వేషించి మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జ్‌గా నియమించి మళ్ళీ తప్పించారు. పార్టీ మారిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి కొత్త ఎమ్మేల్యే అభ్యర్థికి సహకరించేలా ఒప్పించారు. ఇక మంగళగిరిలో నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గానికి భారీ ఓటు బ్యాంక్ ఉంది. అందుకే ఏరి కోరి అదే సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యను ఎంపిక చేశారు జగన్. వెనుకబడిన సామాజిక వర్గానికి అందులోనూ మహిళకు అవకాశం ఇవ్వటం వలన సామాజిక వర్గం మొత్తం ఆమె వెనుకే నడుస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే మురుగుడు లావణ్య తల్లి కాండ్రు కమల రాజకీయనేపథ్యం ఉండటం, మరోవైపు మామగారు మురుగుడు హనుమంతరావుకు రాజకీయ నేపథ్యం ఉండటంతో గెలుపుపై నమ్మకం ఉంచుతున్నారు. మరో వైపు నేను లోకల్, నారా లోకేష్ నాన్‌లోకల్ అంటూ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లోకేష్ ఇప్పటికే దగ్గర ఉండి మంగళగిరిలోనే మకాం వేసి గెలుపు కోసం శ్రమించాల్సిన పరిస్థితులను కల్పించారు. లేదంటే పరువు పోయే పరిస్థితుల్ని కల్పించారు. ఇలా నాయకులను బయపెట్టే రేంజ్‌లో ఐడియాలు వేస్తూ జగన్ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరో వైపు బలమైన బాలకృష్ణ మీద కూడా హిందూపూర్‌లో కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక ను బరిలో నిలుపుతున్నారు. ఇలా రాష్ట్రస్థాయి నాయకుల మీద మహిళలను బరిలో నిలుపుతున్నారు. ఒడిపోతే మహిళ మీద ఓడిపోయారు అని, గెలిస్తే మహిళ మీద గెలిచారు అని హేళన చేసేలా పకడ్బందీ వ్యూహాన్ని రచించారు. చూద్దాం ఎవరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో.