- కొత్త నినాదంతో జనంలోకి వైసీపీ !
- లబ్దిపొందిన వర్గాలను టార్గెట్ !
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలకు వైసీపీని పూర్తిస్దాయిలో సిద్ధం చేసుకున్న సీఎం వైఎస్ జగన్ తాజాగా కొత్త నినాదంతో జనంలోకి వస్తున్నారు. ఇప్పటిదాకా సిద్ధం పేరుతో సభలు నిర్వహించి శ్రేణుల్లో సమరోత్సాహం నింపిన జగన్ మరోసారి ప్రజల్ని ఆకట్టుకునేందుకు కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ నెల 10న జరగనున్న సిద్ధం సభ కోసం వైఎస్సార్‌సీపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సరికొత్త హోర్డింగ్‌లతో ఆకర్షనీయమైన ప్రచారానికి దిగింది. ఓవైపు సిద్ధం సభలతో పొలిటికల్ హీట్ పెంచుతూనే మరోవైపు పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. ప్రజల కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తానంటూ సీఎం జగన్ పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది వైఎస్సార్‌సీపీ. నాకు ఓ కల ఉంది అంటూ జగన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతీ నగరం, ప్రతీ వాడలో కార్మికులతో, పిల్లలతో, అవ్వతాతలతో, అక్కచెల్లమ్మలతో, రైతులతో జగనన్న ఉన్న ఫోటోతో ‘‘మీ కల నా కల’’ పేరుతో స్లోగన్స్ కనిపిస్తున్నాయి. ప్రజల కలే తన కలగా చెబుతూ అవి నేరవేర్చే దిశగా అడుగులు వేస్తానంటూ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ మొత్తం మీ కల నా కల ప్రచారంలో మొత్తం 6 వర్గాల ప్రజలకు చెందిన హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రైతుల కల -జగనన్న కల, కార్మికుల కల-జగనన్న కల, విద్యార్ధుల కల-జగనన్న కల, యువత కల -జగనన్న కల, అవ్వాతాతల కల-జగనన్న కల, అక్కచెల్లెమ్మల కల-జగనన్న కల వంటి స్లోగన్లు కనిపిస్తున్నాయి.
లబ్దిపొందిన వర్గాలను టార్గెట్ చేసిన వైసీపీ !
రైతుల కల-జగనన్న కలలో రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు అందించిన వివిధ పథకాల సాయాన్ని గుర్తుచేయబోతున్నారు. అలాగే కార్మికుల కల - జగనన్న కలలో కార్యికులు శ్రమజీవులని వారి ఆదాయ మార్గాలు చూపుతూ ఎలా ఆదుకున్నారో వివరిస్తారు. ఆ తర్వాత విద్యార్ధుల కల - జగనన్న కలలో విద్యారంగంలో చేపట్టిన పెను మార్పులు, అవి విద్యార్ధుల జీవితాల్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించనున్నారు. ఆ తర్వాత యువత కల - జగనన్న కలలో నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగాలు, ఇతర సాయాలు గుర్తుచేస్తారు. అనంతరం అవ్వాతాతల కల - జగనన్న కలలో వృద్ధులకు ఇంటింటికీ వెళ్లి చేపట్టిన పెన్షన్ల చెల్లింపును వివరిస్తారు. చివరిగా అక్కచెల్లెమ్మల కల - జగనన్న కలలో మహిళల కోసం చేపట్టిన పథకాలను వివరిస్తారు.