లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢల్లీిలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా దీన్ని రిలీజ్ చేశారు. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ ప్రకటించింది. ‘న్యాయ్ పిల్లర్ల’ పేరుతో 25 గ్యారంటీలను ఐదు భాగాలుగా విభజించింది. అందులో సామాజిక న్యాయం, రైతు న్యాయం , కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇచ్చింది. కర్నాటక, తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన విధానాలనే జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టాలని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన చేసింది..నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను రూపొందించింది.
ఖర్గే హామీలు
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడారు. ‘‘మా మేనిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నాం. దేశ రాజకీయ చరిత్రలో న్యాయ పత్రాలుగా దీనిని ప్రజలు గుర్తుంచుకుంటారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో అందిస్తామన్న ఐదు న్యాయాలు, 25 గ్యారంటీలు దీనిలో ఉన్నాయి. ‘యువ న్యాయ్’ కింద ప్రతి విద్యావంతుడికి అప్రంటీస్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తాం. దీని కోసం ఒక్కొక్కరిపై రూ.లక్ష వెచ్చిస్తాం. ‘మహిళా న్యాయ్’ కింద పేద ఇంటి ఆడవారికి ఏటా రూ.లక్ష సాయం చేస్తాం. ‘కిసాన్ న్యాయ్’ కింద రైతులకు రుణమాఫీ, ఎంఎస్‌పీ చట్టాలకు హామీ ఇస్తున్నాం. ‘శ్రామిక్ న్యాయ్’ కింద ఉపాధి హామీ పథకంలో కనీసం రూ.400 వేతనం ఇస్తాం. ‘హిస్సేదార్ న్యాయ్’లో సామాజిక, ఆర్థిక సమానతల కోసం జాతీయ జనగణన చేపడతాం. ఇది ఎవరికీ వ్యతిరేకంగా కాదు. కేవలం ప్రజల స్థితిగతులపై అవగాహన కోసమే చేపడుతున్నాం. రాష్ట్రాలకు అందాల్సిన నిధులను ఇస్తాం. ‘రక్షా న్యాయ్’ కింద విదేశీ వ్యవహారాల్లో కూడా మార్పులు తీసుకొస్తాం. మేం చేయగలిగిన అంశాలనే మేనిఫెస్టోలో చేర్చాం’’ ‘‘మోదీ హయాంలో ఒక్కటైనా పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చారా..? కేవలం తిట్లు తప్పితే ఆయన పాలనలో మరేమీ వినలేదు. విపక్ష నేతలను జైళ్లలో పెడుతున్నారు. ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలేదు. మా పార్టీపై రూ.3,500 కోట్ల జరిమానాలు విధించారు. నేడు మాపై జరిగినవి.. రేపు మీడియాపై జరగవచ్చు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడి మోదీని గద్దె దించాలి. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్టీ హామీలును వారి వద్దకు చేర్చాలి. అవినీతిపరులను పార్టీలో చేర్చుకొని భాజపా మమ్మల్ని నిందిస్తోంది. ప్రధాని ఇప్పటి వరకు భయపడి మణిపుర్ వెళ్లలేదు.. మా నేత రాహుల్ అక్కడికి వెళ్లారు. భయపడే నేత దేశానికి మంచి చేయలేరు’’ అని ఖర్గే పేర్కొన్నారు.
23 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెస్తాం: చిదంబరం
వర్కింగ్ కమిటీలో పూర్తిస్థాయిలో చర్చించి మేనిఫెస్టోను తయారు చేసినట్లు పార్టీ నేత, దీని కమిటీ ఛైర్మన్ పి.చిదంబరం తెలిపారు. గత పదేళ్లలో అన్ని రకాల న్యాయాలు ప్రజలకు అందలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను పనిచేయనీయకపోవడం, బలహీన వర్గాల అణచివేత కొనసాగుతోందన్నారు. పార్లమెంట్ వ్యవస్థను కూడా బలహీనపర్చారని ఆరోపించారు. గత పదేళ్లలో దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చేలా మేనిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలిపారు. ‘వర్క్, వెల్త్, వెల్ఫేర్’(ఉద్యోగాలు, సంపద, సంక్షేమం)ను ప్రజలకు అందిస్తామన్నారు. యూపీఏ తొలి విడత పాలనలో 8.5 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. గత పదేళ్లలో దేశం 5.9 శాతం మాత్రమే వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం 24 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చిందని.. 2024లో అధికారం చేపట్టాక మరో 23 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని చిదంబరం పేర్కొన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది?
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాల గురించి మాట్లాడితే, ఇందులో కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు, పేద కుటుంబాల మహిళలకు సంవత్సరానికి రూ. 1 లక్ష, కులగణన, యం.ఎస్.పి.కి చట్టపరమైన హోదా, MNREGA వేతనం రూ. 400, పరిశోధనాత్మక దుర్వినియోగాన్ని అరికట్టడం వంటివి అంశాలను చేర్చింది. పి.యం.ఎల్.ఏ.చట్టంలోని ఏజెన్సీలు, మార్పులు ఉంటాయని ప్రకటించింది. సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రకటించారు. మేనిఫెస్టో పార్టీ ఐదు న్యాయ సూత్రాల ఆధారంగా పని చేస్తుందని మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం తెలిపారు. ‘భాగస్వామ్య న్యాయం’, ‘కిసాన్ న్యాయం’, ‘మహిళా న్యాయం’, ‘కార్మిక న్యాయం’,’యువ న్యాయం’ అంశాలను ప్రస్తావించారు. ‘యువ న్యాయం’ కింద పార్టీ మాట్లాడిన ఐదు హామీల్లో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు ఒక సంవత్సరం పాటు శిక్షణా కార్యక్రమం కింద రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన అంశాలేంటి?
‘భాగస్వామ్య న్యాయం’ కింద కుల గణన నిర్వహించి, రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కనీస మద్దతు ధర, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ‘కిసాన్ న్యాయ్’ కింద జీఎస్టీ రహిత వ్యవసాయానికి చట్టపరమైన హోదాకు పార్టీ హామీ ఇచ్చింది. ‘కార్మిక న్యాయం’ కింద, కార్మికులకు ఆరోగ్యంపై హక్కు కల్పిస్తామని, రోజుకు కనీస వేతనం రూ.400, పట్టణ ఉపాధి హామీని కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే ‘నారీ న్యాయం’ కింద ‘మహాలక్ష్మి’ హామీ కింద దేశవ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తానంటూ అనేక వాగ్దానాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రేపు జైపూర్, హైదరాబాద్‌లలో బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రజల ముందు ప్రకటించనున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. జైపూర్‌లో నిర్వహించే మేనిఫెస్టో సంబంధిత ర్యాలీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లో మేనిఫెస్టో బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. ఈ ర్యాలీల ద్వారా కాంగ్రెస్ నేతలంతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.