- స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాతో మానసిక అనారోగ్యం
- కౌమారదశలో ఉన్న వారిలోనూ తీవ్ర ప్రభావం
- అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ అధ్యయనాల్లో వెల్లడి
సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం యువతలో మానసిక అనారోగ్యానికి కారణమవుతున్నదని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో జరిపిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా కౌమారదశలో ఉన్న పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు వాడటం, సోషల్ మీడియా యాప్‌లను వినియోగించడం వారి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అధ్యాయనాల్లో తేలింది. లండన్‌లోని కింగ్స్ కాలేజీ చేసిన ఒక అధ్యయనంలో బ్రిటన్‌లోని యువత మానసిక అనారోగ్యంతో సతమతమవుతున్నారని తేలింది. ఆస్ట్రేలియాలోనూ గత రెండు దశాబ్దాలుగా యువతలో మానసిక ఆందోళన పెరిగిపోతున్నదని మరో అధ్యయనంలో తేలింది. 16 ఏండ్ల నుంచి 24 ఏండ్ల మధ్య వయసు గల జనరేషన్ జెడ్‌గా పిలిచే యువతను పరిశీలించగా 40 శాతం మంది గత ఏడాదిలో ఒక్కసారైనా మానసిక సమస్యలను ఎదుర్కొన్నట్టు వెల్లడైంది. 11 నుంచి 14 ఏండ్ల మధ్య కౌమారదశలో ఉన్న 6,639 మంది పిల్లలను పరిశీలించగా 16 శాతం మంది ఆందోళన, 17 శాతం మంది నిరాశ, 14 శాతం మంది అధిక మానసిక క్షోభను అనుభవిస్తున్నట్టు తేలింది. 2022 నాటికే ఆస్ట్రేలియాలో పదేండ్ల వయసు వచ్చే నాటికి 93 శాతం మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. యూట్యూబ్‌లో వీడియోలు, గేమ్స్‌కు ఆకర్షితులైతున్న పిల్లలు గంటల తరబడి సెల్‌ఫోన్స్‌తోనే గడుపుతున్నారు. ఇదీ ముందు ముందు మరింత ప్రమాదకర పరిస్థితులకు దారి తీయవచ్చు. పిల్లల్లో మానసిక సమస్యలకు స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్రధాన కారణంగా పరిశోధకులు భావిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ వినియోగంపై పరిమితులు
ఎదిగే పిల్లలపై స్మార్ట్‌ఫోన్‌లు చూపిస్తున్న దుష్ప్రభావాలపై ఇప్పటికే ఐరాస హెచ్చరిస్తున్నది. పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగాన్ని నిషేధించాలని సూచించింది. పిల్లల మానసిక ఆరోగ్యంపై స్మార్ట్‌ఫోన్‌లు చూపిస్తున్న ప్రభావాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ఇప్పుడు తరగతి గదుల్లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకాన్ని నిషేధించింది. అమెరికాలోని ఫ్లోరిడాలోనూ 14 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చట్టం చేసింది. 14, 15 ఏండ్ల పిల్లలు వాడాలంటే తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేసింది.