- ప్రతిరోజూ రూ.5 కోట్లు లూటీ
- రాష్ట్రం నుంచే ఏటా రూ.1800 కోట్లు
- రోజుకొక ఎత్తుగడతో సైబర్ నేరాలు
- ఫ్రాడ్స్‌లో బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ టాప్
- ప్రజలు ఈజీ మనీకి అలవాటు పడొద్దు
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల డబ్బును.. కర్ర విరగకుండా, చుక్క రక్తం చిందకుండా దోచేస్తున్నారు. ఈ ఏడాది మూడు నెలల్లో నమోదైన టాప్-5 సైబర్ నేరాల్లో బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ టాప్‌లో ఉన్నది. ప్రస్తుతం బెట్టింగ్‌లకు వ్యసనరులైన వారిని గుర్తించి.. వారికి ఈజీమనీని పరిచయం చేసి, అక్కడ బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు మళ్లిస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. రూ.వెయ్యి నుంచి పెట్టుబడి పెట్టించి రూ. లక్షలు, కోట్లలో మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తర్వాతి స్థానాల్లో ఓటీపీ ఫ్రాడ్స్, అడ్వైర్టెజ్‌మెంట్ ఫ్రాడ్స్ (ఓఎల్‌ఎక్స్), ఫెడ్‌ఎక్స్ కొరియర్ సర్వీసెస్, సెక్స్‌టార్షన్ వంటివి టాప్-5 నేరాల్లో ఉన్నట్టు వెల్లడిరచారు. గతంలో విపరీతంగా పెరిగిన సెక్స్‌టార్షన్ మోసాలు.. ప్రస్తుతం తెలంగాణలో తగ్గుముఖం పట్టినట్టు తెలిపారు. సాంకేతిక వినియోగం అధికంగా ఉన్న తెలంగాణలోనే ఈ తరహా భారీ లూటీ జరుగుతుండటం ఆందోళనకరమని, పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడమేనని తెలిపారు. ఈజీ మనీ వైపు అడుగులు వేయొద్దని సూచించారు.