తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం
‘నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. గతంలో కొడంగల్‌లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9 కల్లా అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట తప్పడం, పూటకో పార్టీ మారడం మీ నైజం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తే పార్టీ రద్దు చేసుకుంటరా అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీ లేఖ రాశారు. 120 రోజులు దాటినా మీ గ్యారెంటీలు ఏమయ్యాయి..?’ అని హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500 ఎందుకు ఇవ్వలేదు..? రైతులకు ఎకరానికి రైతు బంధు రూ.15,000 సహాయం ఎందుకు ఇవ్వలేదు..? ధాన్యానికి రూ.500 బోనస్ ఏది..? నిరుద్యోగులకు భృతి ఏదీ..? బీఆర్‌ఎస్ పార్టీ అంటే భయం ఎందుకు..? రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆరు గ్యారంటీలలో 5 హామీలు అమలు చేశానని అంటున్నారు. కానీ ఏ హామీలను అమలు చేయలేదు. మాయమాటలతో అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. చేయకపోయినా హామీలను అమలు చేసినట్టు చెప్పి ప్రజలను బురుడి కొట్టిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కులను నమ్మడం లేదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదు’ అని హరీష్ రావు అన్నారు.