గుంటూరు లోక్‌సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన ఆస్తులను ప్రకటించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.5,700 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయనకు రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులుండగా.. భార్య శ్రీరత్న పేరిట రూ.2,280 కోట్ల చరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ చెరో రూ.1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. చెరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయి. వీటితోపాటు రూ.6.11 కోట్ల విలువైన 4 కార్లు, బ్యాంకు ఖాతాలో చెరో రూ.5.9 కోట్లు ఉన్నాయి. మొత్తం 6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన సాగుభూమి, హైదరాబాద్‌లో రూ.28.1 కోట్ల భూమి, రూ.29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, దిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.6.82 కోట్ల భూమి ఉన్నాయి. శ్రీరత్న పేరిట కృష్ణాజిల్లాలో రూ.2.33 కోట్ల విలువ చేసే సాగుభూమి. దిల్లీలో రూ.34.82 కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.28.26 కోట్ల నివాస భవనాలు ఉన్నాయి.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆస్తులు రూ.1,178.72 కోట్లు
మరోవైపు తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి రూ.1,178.72 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆయన భార్య సంగీతారెడ్డి పేరిట రూ.3,203.9 కోట్ల ఆస్తులు ఉన్నాయి. విశ్వేశ్వర్‌రెడ్డి భూములు, భవనాల విలువ రూ.71.35 కోట్లు. అప్పులు మొత్తం రూ.1.76 కోట్లు. విశ్వేశ్వర్‌రెడ్డిపై 4 కేసులు ఉన్నాయి.