Pavan Kalyan : జగన్‌కి ఓటేస్తే మీ భవిష్యత్తును మీరే తగలబెట్టుకున్నట్టే !

0

సొంత బాబాయ్‌ని గొడ్డలితో నరికి చంపినవాణ్ని సీఎం జగన్‌ భుజాల మీద వేసుకుని తిరుగుతారు. సొంత చెల్లెలి దుస్తుల రంగుల గురించి హేళన చేస్తూ మాట్లాడతారు. తోడబుట్టిన చెల్లెలు ధరించిన దుస్తుల రంగులను ఎవరైనా చూస్తారా? పచ్చదనంపై ద్వేషం ఉంటే చెట్లను చూడడం మానేస్తామా? పసుపు రంగులో ఉన్నాయని బంతిపూలను విగ్రహాలకు వేయడం మానేస్తామా? జగన్‌ నా భార్యను, చంద్రబాబు సతీమణిని విమర్శించారు. ఇప్పుడు మరింత దిగజారి సొంత చెల్లెళ్లనూ తిడుతున్నారు. వైసీపీ మళ్లీ వస్తే ఆడబిడ్డలకు రక్షణ ఉండదు. `- పవన్‌ కళ్యాణ్‌ 

వైసీపీ అవినీతిపరులను ఒకటే హెచ్చరిస్తున్నా.. 18 రోజుల్లో కూటమి ప్రభుత్వం స్థాపిస్తాం.. అక్రమాలు చేసిన ప్రతి వైసీపీ నాయకుణ్నీ రోడ్డుపైకి లాగి తిన్నదంతా కక్కిస్తాం’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. జగన్‌ను మళ్లీ గెలిపిస్తే మీ బంగారు భవిష్యత్తును మీరే పెట్రోలు వేసుకుని తగలబెట్టుకున్నట్లే.. మీ నాశనాన్ని మీరే కొనితెచ్చుకున్నట్టేనని ప్రజలను అప్రమత్తం చేశారు. వైసీపీ ఓడిపోవడం.. జగన్‌ ఇంటికెళ్లడం ఖాయమని పునరుద్ఘాటించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం, రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలలో శుక్రవారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేనాని ప్రసంగించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్‌ సిక్స్‌తో ఆరు పథకాలు అమలు చేస్తామని ప్రకటించిందని, జనసేన మరో నాలుగు అంశాలు చెప్పిందని.. అన్నింటితో కలిపి అన్ని వర్గాలకూ న్యాయం చేస్తూ ఈ నెల 30న మ్యానిఫెస్టో ప్రకటిస్తామని పవన్‌ వెల్లడిరచారు. ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. పొరపాటున వైసీపీకి ఓటేస్తే ఆడబిడ్డలకు భద్రత ఉండదు. యువతకు ఉపాధి అవకాశాలు రావు.. రైతులకు గిట్టుబాటు ధర దక్కదు. భూదస్త్రాలు డిజిటలైజేషన్‌ చేస్తూ ప్రభుత్వ ఆస్తుల మాదిరిగా మీ ఆస్తులనూ జగన్‌ తాకట్టు పెట్టేస్తారు’ అని పవన్‌ నిప్పులు చెరిగారు. వైసీపీ రద్దు చేసిన సహకార, సాగునీటి సంఘాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ‘పీఏసీఎస్‌ల్లో ఒకప్పుడు దాతలను, పరిపాలనాదక్షులను ఛైర్మన్‌, డైరెక్టర్లుగా ఎన్నుకునేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ తీసేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబును డీసీసీబీ ఛైర్మన్‌గా నియమించారు. దళిత యువకుణ్ని హత్య చేసి, డోర్‌ డెలివరీ చేసిన వ్యక్తికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయి? డ్రైవర్‌ను చంపేసిన ఎమ్మెల్సీపై చర్యలకు అతీగతీ లేదు. అంతర్వేది లక్ష్మీనారసింహుని రథాన్ని కాల్చేస్తే పిచ్చోడి పని అన్నారు. నిందితుణ్ని పట్టుకోలేదు. కానీ అంతమంది సమూహంలో ఒక గులకరాయి జగన్‌పై పడితే నిందితుణ్ని పట్టుకున్నారు. అంటే మీరు పట్టుకోవాలంటే పట్టుకోగలరు. కానీ అపోహలు, గొడవల మధ్య ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు. ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి. విదేశీయుడైన కాటన్‌ను గుండెల్లో పెట్టుకున్నాం. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెడితే ప్రజలు ఎందుకు గొడవపడతారు? వైసీపీ వాళ్లే పేరు పెట్టి వాళ్ల నాయకులే గొడవ చేస్తారు. ఆ కేసుల్లో ఏ1గా ఉన్న అన్నెం సాయి ఈ రోజు మంత్రి విశ్వరూప్‌ వెనక ఉన్నారు. దీన్ని బట్టి గొడవలకు కారణమెవరో ఆలోచించాలి’ అని పవన్‌ ప్రజలను కోరారు.

మీరు ఒక చెయ్యెత్తితే మేం లక్ష చేతులెత్తుతాం

జగన్‌లాంటి గూండాలకు, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలాంటి దోపిడీదారులకు భయపడనని పవన్‌ స్పష్టం చేశారు. ‘చిత్తూరు జిల్లాలోని పీలేరు తదితర నియోజకవర్గాల్లో ఎవరైనా వేలు పెడితే సహించబోమని మిథున్‌రెడ్డి అన్నారు. వాళ్ల గురించి ఎవరూ మాట్లాడకూడదు. మిథున్‌రెడ్డి మాత్రం ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రతి అంశంలోనూ వేలు పెట్టొచ్చా? మీ ముగ్గురికి ఒకటే చెబుతున్నా. ఇది జనసేన. మీరు ఒక చెయ్యెత్తితే లక్ష చేతులెత్తుతాం’ అని జనసేనాని హెచ్చరించారు. అసెంబ్లీకి తాను వెళ్లుంటే పరిస్థితి వేరేలా ఉండేదని పవన్‌ వ్యాఖ్యానించారు. ‘ఉప్మాకో, కాఫీకో అమ్ముడుపోవద్దు. దశాబ్దంగా మీ కోసం నిలబడ్డానంటే అది మీరిచ్చిన బలమే. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా జనసేన ఓటు వారికే వేయాలి’ అని పవన్‌ కార్యకర్తలను కోరారు. ‘ప్రభుత్వం మారబోతుంది. మన ప్రభుత్వం వస్తోంది. వైసీపీ అవినీతి కోటలు బద్దలుకొట్టాలి. కూటమి విజయం సాధించాలి. అందుకు మీ ఆశీస్సులు కావాలి’ అని ప్రజల్ని కోరారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పోటీచేస్తున్నట్లేనన్నారు. పిఠాపురంలో తెలుగుదేశం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. కూటమి తరఫున పోటీచేస్తున్న అమలాపురం లోక్‌సభ అభ్యర్థి గంటి హరీష్‌ మాథుర్‌, రాజోలు, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ అభ్యర్థులు దేవ వరప్రసాద్‌, వాసంశెట్టి సుభాష్‌, వేగుళ్ల జోగేశ్వరరావులను గెలిపించాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !