The Family Star : ది ఫ్యామిలీ స్టార్‌ సినిమా రివ్య్వూ

0

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో ఒక పెద్ద స్టార్‌ అయ్యాడు. ఆ తరువాత ‘టాక్సీవాలా’ అనే సినిమా కూడా హిట్‌ అయింది. ఇవన్నీ 2018 సంవత్సరం వరకు చేసిన సినిమాలు. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు వ్యాపారాత్మకంగా విజయ్‌ కి బ్రేక్‌ ఇవ్వలేదనే చెప్పాలి. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా బాగుంది అన్నారు, కానీ వ్యాపారాత్మకంగా నడవలేదు. తరువాత ఇంకో పెద్ద సినిమా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ వచ్చింది, అది కూడా నడవలేదు.  ఆ తరువాత పాన్‌ ఇండియన్‌ సినిమా అంటూ ‘లైగర్‌’ వచ్చింది, అది విజయ్‌ కెరీర్‌ లో ఒక పెద్ద మైనస్‌ అయింది. గత సంవత్సరం ‘ఖుషీ’ సినిమా విడుదలైంది, మిశ్రమ ఫలితం వచ్చింది. అంటే విజయ్‌ కి ఒక పెద్ద బ్రేక్‌ వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ ‘ది ఫామిలీ స్టార్‌’ సినిమా విడుదలైంది. దీనికి పరశురామ్‌ పెట్ల దర్శకుడు, మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటించింది. దిల్‌ రాజు, శిరీష్‌ సోదరులు నిర్మాతలు. గోపి సుందర్‌ సంగీతం అందించారు. మరి ఈ సినిమా విజయ్‌ కి బ్రేక్‌ ఇచ్చిందో, లేదో చూద్దాం.

కథ ఏమిటంటే...

గోవర్ధన్‌ (విజయ్‌ దేవరకొండ) మధ్య తరగతి యువకుడు. కుటుంబం అంటే ప్రాణం. సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నా కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైదరాబాద్‌లోనే పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసైన పెద్దన్నయ్య, ఇంకా జీవితంలో స్థిరపడే దశలోనే ఉన్న చిన్నన్నయ్య. ఇద్దరు అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు, బామ్మ, ఇలా ఒక మధ్యతరగతి కుటుంబంలో చిన్నవాడైన గోవర్ధన్‌ కుటుంబాన్ని తన భుజస్కందాలపై నడిపిస్తూ వుంటారు. ఎప్పుడూ ఎక్కడ అదా చెయ్యాలి, ఎలా డబ్బులు అదా చేయొచ్చు అని చూస్తూ ఉంటాడు. ఒక అన్నయ్య ఎప్పుడూ తాగుతూ మద్యం నడిపే దుకాణదారుడితో గొడవపడుతూ ఉంటాడు. అన్నయ్య పిల్లల స్కూల్‌ ఫీజులు, వాళ్ళ అవసరాలు అన్నీ గోవర్ధన్‌ చూసుకుంటూ సంపాదనలో అన్నీ జాగ్రతగా ఖర్చు పెడుతూ ఉంటాడు. అలాగే తన కుటుంబసభ్యులని ఎవరైనా ఏమైనా అన్నా ఊరుకునే మనస్తత్వం కూడా కాదు గోవర్ధన్‌ ది, ఎదురుతిరిగి తగిన బుద్ధి చెపుతూ వుంటాడు. అలాంటి సమయంలో ఆ ఇంట్లోకి వస్తుంది ఇందు (మృణాల్‌ ఠాకూర్‌) అనే అమ్మాయి. గోవర్ధన్‌ ఉంటున్న ఇంట్లోనే మేడ మీద ఒక గది ఖాళీగా ఉంటే అద్దెకి దిగుతుంది. గోవర్ధన్‌ మొదట్లో ఆమెని వ్యతికేరించినా, మెల్లగా ఆమె చేస్తున్న పనులు నచ్చి ఆమెతో ప్రేమలో పడతాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటాడు. అదే సమయంలో ఆమె గోవర్ధన్‌ మీద ఒక థీసిస్‌ రాస్తుంది, అది తను చేసే మధ్యతరగతి కుటుంబం గురించిన రీసెర్చ్‌ అని యూనివర్సిటీలో సబ్మిట్‌ చేస్తుంది. అందులో గోవర్ధన్‌ మధ్యతరగతి కుటుంబం గురించిన వివరాలు అన్నీ ఉంటాయి. గోవర్ధన్‌ ఆ పుస్తకం చదివి తన కుటుంబాన్ని మొత్తం రోడ్డుమీదకు ఇందు తీసుకువచ్చిందని, ఆమెని అసహ్యించుకుంటాడు. మధ్య తరగతి కుటుంబం అంటే పస్తులుండే కుటుంబం కాదని, తలుచుకుంటే మేము కూడా సంపన్నులం అవగలమని చూపిస్తాడు. వెంటనే తనకి ఇంతకు ముందు ఆఫర్‌ ఇస్తామన్న ఒక పెద్ద వ్యాపారవేత్త (జగపతి బాబు) దగ్గరికి వెళ్లి తాను ఇప్పుడు ఆ జాబ్‌ తీసుకుంటానని ప్రాధేయపడితే అతను గోవర్ధన్‌ కి ఆ జాబ్‌ ఇస్తాడు, అలాగే రెండు సంవత్సరాల జీతం అడిగితే అది కూడా ముందే ఇస్తాడు. తాను మధ్యతరగతి కుటుంబం కాదని, ధనవంతుల కుటుంబం అని ఇందుకు చెప్తాడు, ఆమె మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇంతకీ ఈ ఇందు అనే అమ్మాయి ఎవరు? ఆమె నిజంగానే గోవర్ధన్‌ మధ్యతరగతి కుటుంబాన్ని వీధిలోకి లాగడం కోసమే థీసిస్‌ రాసిందా? ఆ వ్యాపారవేత్త గోవర్ధన్‌ అడగగానే వుద్యోగం, జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడు? గోవర్ధన్‌, ఇందు మళ్ళీ కలిసారా? వాళ్ళు పెళ్లిచేసుకున్నారా? తరువాత ఏమైంది, గోవర్ధన్‌ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది తెలియాలంటే ‘ది ఫామిలీ స్టార్‌’ సినిమా చూడాల్సిందే. 


ఎలా ఉందంటే

తన కుటుంబాన్ని... తన జీవితంలోకి వచ్చిన ఓ అమ్మాయినీ ప్రాణంగా ప్రేమించిన ఓ యువకుడి కథే ఈ చిత్రం. కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఆ యువకుడు.. అదే స్థాయిలో తన కుటుంబాన్ని, తన మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు? మధ్యలో వచ్చిన అపార్థాలు ఎలాంటి సంఘర్షణకి కారణమయ్యాయన్నది ఈ సినిమాలో కీలకం. ‘ఐ లవ్‌ యూ’ అనే మాట ఓ వ్యక్తికి చెప్పేది కాదు, ఓ కుటుంబానికి చెప్పేది అంటూ మన కుటుంబ వ్యవస్థ బలాన్ని దర్శకుడు ఈ కథతో చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. కథపరంగా చూస్తే చిన్న అంశమే. ఓ బలమైన సినిమాకి, అంచనాలున్న సినిమాకి కావాల్సిన సరకు, సంఘర్షణ అందులో కనిపించదు. కానీ, కొద్దిమంది దర్శకులు కథనం, మాటలతోనే మేజిక్‌ చేస్తుంటారు. పరశురామ్‌లోనూ అలాంటి రచయిత ఉన్నాడని ఆయన సినిమాలు చాటి చెప్పాయి. అయితే ఈ సినిమా విషయానికొచ్చేసరికి  కథనం పరంగానూ ఆయన చేసిన కసరత్తులు చాలలేదు. ఘన విజయం సాధించిన ‘గీత గోవిందం’ తర్వాత ఆ కలయికలో వస్తున్న సినిమా ఇది. ప్రత్యేకమైన  అంచనాలతో ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. అయితే అటు హాస్యపరంగా కానీ, ఇటు కథ, కథనాల పరంగా కానీ  ఏ దశలోనూ ఆ అంచనాల్ని అందుకోలేదు ఈ చిత్రం. మధ్య తరగతి యువకుడిగా విజయ్‌ దేవరకొండ చేసే విన్యాసాలతో కథ మొదలవుతుంది. ఇంట్లోనూ, బయట పొదుపు కోసం కథానాయకుడు పడే పాట్లతో సన్నివేశాలు సాగిపోతుంటాయి. అవి సాగుతున్నట్టే ఉంటాయి తప్ప పెద్దగా ప్రభావం చూపించవు. వాస్తు ప్రకారం సాగే ఫైట్‌ కాస్త కొత్తగా ఉంటుంది. ఇందు పాత్ర రాక తర్వాత కూడా సన్నివేశాలు పెద్దగా పండలేదు. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలే సినిమాని కాస్త ఆసక్తికరంగా మార్చాయి. అక్కడ మలుపు ఊహించేదే అయినా, ద్వితీయార్ధంపై అంచనాలు పెంచుతాయి.  అమెరికా నేపథ్యంలో సాగే ద్వితీయార్ధంలోని  చాలా సన్నివేశాలు బోర్‌ కొట్టిస్తాయి. ఇందు థీసిస్‌ ప్రసంగం, ఆ నేపథ్యంలో సన్నివేశాలు పర్వాలేదనిపించినా, పతాక సన్నివేశాలు  సాధారణంగానే అనిపిస్తాయి. అక్కడక్కడా కొంత సంఘర్షణ, కొన్ని మాటలు,  విజయ్‌ దేవరకొండ - మృణాల్‌ ఠాకూర్‌ జోడీ మినహా సినిమా పెద్దగా ప్రభావం చూపించదు. భావోద్వేగాలు, హాస్యం కృత్రిమంగా అనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే

విజయ్‌ దేవరకొండ మధ్య తరగతి యువకుడైన గోవర్ధన్‌ పాత్రలో ఒదిగిపోయాడు. ‘గీత గోవిందం’ సినిమా తరువాత అటువంటి పాత్రలాగే ఇది కూడా కొంచెం వుంది అనిపిస్తుంది. విజయ్‌ మంచి ప్రతిభ గల నటుడు తనకిచ్చిన పాత్రల్లో ఇమిడిపోతాడు, ఇందులో కూడా అలానే గోవర్ధన్‌ పాత్రలో ఇమిడిపోయాడు. కానీ కథ బలంగా లేనప్పుడు అతనుమాత్రం ఏమి చేస్తాడు. ఇక మృణాల్‌ ఠాకూర్‌ పాత్ర అంత బలంగా లేదు, అదీ కాకుండా విజయ్‌, మృణాల్‌ మధ్య ఆ కెమిస్ట్రీ అంతగా వర్కవుట్‌ కాలేదు అనిపిస్తుంది. రెండో సగంలో వెన్నెల కిశోర్‌ వస్తాడు, అతని కామెడీ చూసి చూసి మరీ బోర్‌ అయిపొయింది. ఏ సినిమాలో చూసిన అదే వినోదం, అవే సన్నివేశాలు అతనివి అనిపిస్తుంది.అలాగే విజయ్‌ అతని కుటుంబం మధ్యలో కొన్ని బలమైన సన్నివేశాలు పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో జరిగే సంఘర్షణ ఈ సినిమాలో కనిపించదు. రెండో సగం అంతా కుటుంబం నుండి విడిపోయి వేరే కథ చూస్తున్నాము అన్నట్టుగా ఉంటుంది. రోహిణి హట్టంగడి పాత్ర అంతగా లేదు. ఒక తెలుగు తెలిసిన నటిని పెడితే ఆ పాత్రలో కొంచెం భావోద్వేగాలు ఉండేవేమో. క్లైమాక్స్‌ లో కూడా ఆమె సన్నివేశం అంతగా పండలేదు. జగపతి బాబు పాత్ర కామియో లా ఉంటుంది. వాసుకి, అభినయ తమ పాత్రల పరిధి మేరకి చేశారు. అల్లరి రవిబాబు పాత్ర ఎందుకు పెట్టారో దర్శక నిర్మాతలకు మాత్రమే తెలియాలి. దివ్యాంశ కౌశిక్‌ పాత్ర పరిమితం అయినా ఆమె చూడటానికి అందంగా వుంది. మిగతా పాత్రలన్నీ తమ పరిధి మేరకి చేశారు. సాంకేతికంగా సినిమా అంతంత మాత్రమే.  సంగీతం, కెమెరా విభాగాలు పర్వాలేదనిపించాయి. కొన్ని సన్నివేశాలు, సంభాషణల్లో మాత్రమే దర్శకుడు  పరశురామ్‌ మార్క్‌  కనిపించింది.

(ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !