ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడిరచాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్ జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. బస్సు యాత్రలో భాగంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉన్నారని.. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. ప్రత్యేకహోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక బీజేపీకి తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. ‘హోదా’ వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవి. రాజధాని లేదు.. పోలవరం పూర్తికాలేదు.. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్‌పై ఒక్క అడుగూ ముందుకు పడలేదని.. వైఎస్‌ఆర్ ఉండి ఉంటే అది పూర్తయ్యేదని చెప్పారు. ప్రజల భవిష్యత్ బావుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
హంతకులను కాడుడుతున్న జగన్ !
కడప పార్లమెంట్ స్థానం నుంచి నేను పోటీ చేయడానికి కారణం.. వివేకాను హత్య చేయించిన వారికే మళ్లీ ఎంపీ టికెట్ ఇవ్వడం. హంతకులను కాపాడేందుకు అధికారాన్ని వాడుతున్నారు. ఇది దుర్మార్గం కాదా? హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఒక వైపు రాజశేఖర్‌రెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాష్ ఉన్నారు. ధర్మం కోసం ఒకవైపు నేను.. మరోవైపు డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి. ఎవర్ని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించాలి’’ అని షర్మిల అన్నారు.
అవినాష్‌రెడ్డిని ఓడిరచాలి: సునీత
ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలను ప్రజలంతా దీవించాలని వివేకా కుమార్తె సునీత కోరారు. తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఆమెను ఎంపీగా చేయాలనేది వివేకా చివరి కోరికని.. దాన్ని నెరవేర్చాలన్నారు. అవినాష్‌రెడ్డిని ఓడిరచాలని ఆమె పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌లో చేరిన కిల్లి కృపారాణి
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్‌రావు కాంగ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ కండువా వేసి షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్, వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానన్నారు. ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టానని.. అలాంటి తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మాకు వైఎస్‌ఆర్ దేవుడు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. షర్మిలలో వైఎస్‌ఆర్‌ను చూస్తున్నాం. ఆమె నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్ ఒక నియంత.. ఆయన్ను గద్దె దించాలి. కడప ఎంపీగా షర్మిలకు అవకాశం కల్పించాలి’’ అని కృపారాణి అన్నారు.