YS Sharmila : గొడ్డలితో అందరినీ నరికేయండి, అప్పుడు మీ రే సింగిల్‌ ప్లేయర్‌ !

0

కడప జిల్లాలో వైఎస్‌ వారసుల మధ్య రాజకీయ మాటలు ముదురుతున్నాయి. అవినాష్‌ రెడ్డి మీద సునీత, వైఎస్‌ జగన్‌ మీద షర్మిల ఇలా.. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. కడప లోక్‌ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వైఎస్‌ షర్మిల.. తాజాగా వైఎస్‌ భారతి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం వైఎస్‌ వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌ రెడ్డికి టికెట్‌ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తూ వచ్చిన షర్మిల.. ఈ సారి ఏకంగా అవినాష్‌ రెడ్డి ఊరు దాటిపోవడానికి సిద్ధమవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే అరెస్ట్‌ చేస్తారనే భయంతో.. ఊరుదాటి పోయేందుకు పాస్‌ పోర్టులు కూడా సిద్ధం చేసుకుంటున్నారంటూ షర్మిల విమర్శించారు. అవినాష్‌ రెడ్డిని గెలిపిస్తే నేరం చేసినట్లేనన్న షర్మిల.. జైలుకు వెళ్లే ఎంపీ కావాలో.. ప్రజలకు అందుబాటులో ఉండే ఎంపీ కావాలో తేల్చుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారతిపైనా సంచలన వ్యాఖ్యలు

మరోవైపు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సతీమణి, వదిన వైఎస్‌ భారతిపైనా షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.  కడపలో వైసీపీ సింగిల్‌ ప్లేయర్‌ అంటూ ఇటీవల సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. ‘‘వాళ్లే అధికారంలో ఉండాలి.. వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలి.. వాళ్లే సింగిల్‌ ప్లేయర్‌గా ఉండాలి.. భారతి స్ట్రాటజీ ఇదేనా? గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్‌ ప్లేయర్‌. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే నాకు ఓటెయ్యండి. మీ ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్‌రెడ్డికి ఓటెయ్యండి. దేవుడు మా వైపే ఉంటాడు.. గొడ్డలితో నరికే వాళ్ల వైపు కాదు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్‌ వివేకాను హత్యకేసులో నిందితులను చట్టసభలకు వెళ్లనివ్వనంటూ షర్మిల.. కడప స్థానాన్ని పోటీచేయడానికి ఎంచుకున్నారు. అప్పటి నుంచి వైఎస్‌ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి.షర్మిల, వైఎస్‌ జగన్‌ మేనత్త విమలారెడ్డి.. జగన్‌, అవినాష్‌ వైపు నిలుస్తున్నారు. అలాగే వైఎస్‌ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత, వైఎస్‌ షర్మిల ఓ వైపు నిలుస్తున్నారు. అయితే వైఎస్‌ షర్మిల.. తన ప్రత్యర్థులతో చేతులు కలిపి తమను ఓడిరచాలని చూస్తున్నారంటూ సీఎం వైఎస్‌ జగన్‌ సైతం ఇటీవల ఆరోపించారు. షర్మిల అంటే జాలేస్తోందని.. కడపలో డిపాజిట్లు కోల్పోతుందని బాధగా ఉందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ జగన్‌ ప్రస్తావించారు. చెల్లెమ్మ అంటే ప్రేమేనన్న జగన్‌.. రాంగ్‌ డైరెక్షన్‌లో వెళ్తున్నారంటూ విమర్శించారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ విమర్శలను షర్మిల సైతం అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. 

ఏపీ ప్రజల ‘మన్‌కీ బాత్‌’ ప్రధాని వినాలి

ప్రధాని నరేంద్ర మోదీకి షర్మిల రేడియో గిఫ్ట్‌గా పంపారు. ఏపీ ప్రజల మన్‌ కీ బాత్‌ ఆయన వినాలని కోరారు. ఆయనకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లలో మోదీ చేసిన మోసాలపై 10 ప్రశ్నలు సంధిస్తున్నట్లు షర్మిల చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !