ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ షాక్ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. ‘‘రాజశేఖర్‌రెడ్డి గారిని అభిమానించే వారికి, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే వారికి, యావత్ కడప లోక్‌సభ నియోజకవర్గ ప్రజలందరకీ నా విన్నపం. రాజశేఖర్ రెడ్డి గారిని ఏ విధంగా అభిమానించారో!, ఏ విధంగా అక్కున చేర్చుకున్నారో!, ఏ విధంగా నిలబెట్టుకున్నారో ఆయన కూడా ఆయన ఊపిరున్నంత వరకు ప్రజా సేవకే అంకితమయ్యారు. ప్రజా సేవ చేస్తూనే ఆయన చనిపోయారు. ఈ రోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాఉంది. ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్‌కు పంపమని, తండ్రిలాగే సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వమని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను’’ అంటూ విజయమ్మ వీడియో విడుదల చేశారు.
షర్మిలకు మద్దతు
దీంతో కూతురు షర్మిలకు మద్దతు ప్రకటించడం వైఎస్ జగన్‌కు విజయమ్మ బిగ్ షాకిచ్చినట్టు అయ్యింది. అంటే అవినాశ్ రెడ్డిని ఓడిరచమనే ఆమె కోరుతున్నారు. కొడుకు జగన్ బలపరచిన అభ్యర్థికి వ్యతిరేకంగా వైయస్ విజయమ్మ వీడియో విడుదల చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కొన్నాళ్లుగా అమెరికాలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వద్ద ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, తాజాగా ఆమె ఓ వీడియో సందేశంతో ఓ విషయంపై స్పష్టత ఇచ్చారు. వైఎస్ ముద్దు బిడ్డ ఎవరో, వైఎస్ అభిమానులు ఎవరికి ఓటు వేసి గెలిపించాలో తేల్చిచెప్పారు. కడప ఓటర్లు షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరడం రాజకీయ వారసత్వాన్ని ప్రకటించినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కన్న తల్లే జగన్‌ను నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి.