సుప్రీంకోర్టు ఆదేశాలనుసైతం పట్టించుకోకుండా యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులనుకూడా నియమించాలని సూచించింది. నాలుగు రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్‌లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని, ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ లను కూడా ఏర్పాటు చేయాలని, అక్రమ ఇసుక తవ్వకాలను నిషేదించడానికి పెద్దఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఫిర్యాదులకోసం టోల్ ఫ్రీ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలని, తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు థిక్కార చర్యలను తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తెరిగి విధులను నిర్వర్తించాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీలో యథేచ్చగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ దృవీకరించింది. ఈ మేరకు మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు సమర్పించింది. సుమారు 10వేల కోట్ల రూపాయల మేరకు అక్రమ ఇసుక రవాణా జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ప్రతివాది తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఫోటోలు, ఆధారాలతోసహా సుప్రీంకోర్టుకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలు ఒకరిచేతిలో ఒకరుగా కలిసిమెలిసి అక్రమ ఇసుక మైనింగ్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులుకూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా? లేదా? అన్నది తనిఖీ చేయాలి. కేంద్ర అధికారులు సందర్శించే విషయాన్ని రాష్ట్ర అధికారులకు చెప్పాల్సిన అవసరం లేదు. సమాచారంకూడా ఇవ్వొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే తీసుకున్న చర్యలను వివరిస్తూ.. ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయగా.. ఆ వివరాలు పట్టించుకోకుండా సుప్రీంకోర్టు ధర్మాసనం మార్గదర్శకాలు జారీచేసింది. జులై 9లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని, తదుపరి విచారణ జులై 15న చేపడుతామని, అప్పటి లోగా ఇతర వివరాలుకూడా కోర్టుకు అందించాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.