Bhaje Vaayu Vegam : భజే వాయు వేగం’ సినిమా రివ్య్వూ

0

బెదురులంక లాంటి హిట్‌ సినిమా తర్వాత కార్తికేయ నేడు ‘భజే వాయు వేగం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’, ‘గామి’ విజయాల తర్వాత యూవీ సంస్థ నుంచి వచ్చిన చిత్రమిది. కొత్త దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించారు. ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌ గా నటించగా హ్యాపీ డేస్‌ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించాడు. టీజర్‌, ట్రైలర్లు ఆసక్తి రేకెత్తించేలా ఉండటంతో ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలేర్పడ్డాయి. మరి, ఈ చిత్ర కథేంటి? అది సినీప్రియులకు ఎలాంటి అనుభూతిని అందించింది? తెలుసుకుందాం.

కథేంటంటే

వరంగల్‌ దగ్గరున్న రాజన్నపేటకు చెందిన కుర్రాడు వెంకట్‌ (కార్తికేయ). తల్లిదండ్రులు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో అనాథైన వెంకట్‌ను తండ్రి స్నేహితుడు లక్ష్మయ్య (తనికెళ్ల భరణి) చేరదీసి.. తన కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటు పెంచి పెద్ద చేస్తాడు. క్రికెటర్‌ అవ్వాలన్న లక్ష్యంతో వెంకట్‌.. మంచి ఉద్యోగం సంపాదించాలన్న కోరికతో రాజు ఊరి నుంచి హైదరాబాద్‌కు వస్తారు. కానీ, కొందరు చేసిన కుట్రల వల్ల అనుకున్న లక్ష్యాల్ని చేరుకోలేకపోతారు. దీంతో వెంకట్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు వేస్తూ.. రాజు ఓ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఓసారి వాళ్ల తండ్రి అనారోగ్యానికి గురవుతాడు. ఆయన్ని కాపాడాలంటే ఆపరేషన్‌ చేయాలని.. అందుకు రూ:20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతారు. దీంతో ఆ డబ్బు సంపాదించే క్రమంలో వెంకట్‌.. డేవిడ్‌ (రవిశంకర్‌) గ్యాంగ్‌ దగ్గర క్రికెట్‌ బెట్టింగ్‌ వేస్తాడు. ఆ బెట్టింగ్‌లో వెంకట్‌ గెలిచినా.. తను గెలుచుకున్న రూ.40లక్షలు ఇచ్చేందుకు డేవిడ్‌ మనుషులు నిరాకరిస్తారు. పైగా రాత్రి 9గంటల కల్లా  రూ.40 లక్షలు ఎదురు ఇవ్వాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించి వెళ్తారు. ఈ క్రమంలో వెంకట్‌ చేసేదేమీ లేక డేవిడ్‌ కొనుక్కున్న కొత్త కారును తన అన్నతో కలిసి కొట్టేస్తాడు. అయితే దాంట్లో రూ.8 కోట్ల డబ్బు, రూ.5000 కోట్ల హవాలా డబ్బుకు సంబంధించిన రూ.2 వేల నోటుతో పాటు డేవిడ్‌ అన్న, హైదరాబాద్‌ మేయర్‌ జార్జ్‌ (శరత్‌ లోహితస్వ) కొడుకు శవం కూడా ఉంటుంది. దీంతో ఆ కారును దక్కించుకునేందుకు డేవిడ్‌ తన గ్యాంగ్‌తో వెంకట్‌ వెంటపడతాడు. మరోవైపు కనిపించకుండా పోయిన జార్జ్‌ కొడుకు కోసం హైదరాబాద్‌ పోలీసులంతా సిటీని జల్లెడ పడతారు. మరి, ఆ తర్వాత ఏమైంది? ఓవైపు డేవిడ్‌ గ్యాంగ్‌ నుంచి.. మరోవైపు పోలీసుల నుంచి వెంకట్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన తండ్రిని కాపాడుకునేందుకు తనేం చేశాడు? అసలు జార్జ్‌ - డేవిడ్‌ల కథేంటి? తన అన్న కొడుకును డేవిడ్‌ ఎందుకు చంపాడు? ఈ నిజం జార్జ్‌కు తెలిసిందా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే

తండ్రి సెంటిమెంట్‌ను.. ఓ క్రైమ్‌ ఎలిమెంట్‌ను మిళితం చేసి రూపొందించిన థ్రిల్లర్‌ ‘భజే వాయు వేగం’. క్రికెటర్‌ అవ్వాలన్న లక్ష్యంతో పల్లెటూరి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ సామాన్య కుర్రాడు.. తండ్రి ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఒక అసాధారణమైన క్రైమ్‌లో ఇరుక్కుంటే దానినుంచి ఎలా బయటపడ్డాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. లైన్‌గా చూసుకున్నప్పుడు దీంట్లో ఓ మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌కు కావాల్సిన మసాలాలన్నీ చక్కగా కుదిరినట్లు అనిపిస్తుంది.. ప్రచార చిత్రాల్ని కట్‌ చేసిన తీరు చూస్తే ఈ చిత్రం టైటిల్‌ కూడా దీనికి సరిగ్గా కుదిరినట్లే కనిపించింది.. కానీ, తెరపై సినిమా చూస్తున్నప్పుడు కథనమంతా చాలా రొటీన్‌గా నెమ్మదిగా సాగిన అనుభూతి కలుగుతుంది. పైగా దీంట్లో ఉన్న ఒకటి, రెండు ట్విస్టులు కూడా ఊహకు అందేలాగే ఉంటాయి. ఇక నాయకానాయికల మధ్య వచ్చే చిన్న ప్రేమ కథ కూడా ఏమాత్రం మెప్పించదు. విరామ సన్నివేశాలు థ్రిల్‌ పంచినా.. సినిమాని ముగించిన తీరు అసంతృప్తిగా అనిపిస్తుంది. హీరోని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో కూర్చొబెట్టే సీన్‌తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. అక్కడి నుంచి కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి టర్న్‌ అవుతుంది. కథానాయకుడి బాల్యం.. లక్ష్మయ్య కుటుంబంలోకి వెళ్లాక వాళ్లతో పెనవేసుకున్న అనుబంధాలు.. క్రికెటర్‌గా మారాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టడం.. ఇలా నెమ్మదిగా అతని ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఆ వెంటనే జార్జ్‌, డేవిడ్‌ల నేర చరిత్రను చూపించి ఆసక్తిరేకెత్తించారు. ఈ మధ్యలో వచ్చే నాయకానాయికల లవ్‌ట్రాక్‌ బలవంతంగా ఇరికించినట్లు ఉంటుంది. హీరో తండ్రి అనారోగ్యానికి గురవడం.. డబ్బుల కోసం అతను డేవిడ్‌ గ్యాంగ్‌ వద్ద బెట్టింగ్‌ వేసి గెలవడం.. ఈ క్రమంలో వాళ్ల మధ్య తలెత్తే ఘర్షణతో అసలు కథ మొదలవుతుంది. ఇక ఎప్పుడైతే హీరో డేవిడ్‌ కారును కొట్టేస్తాడో అక్కడినుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. కాకపోతే ఆ థ్రిల్‌ను ద్వితీయార్ధం ఆసాంతం కొనసాగించలేకపోయాడు దర్శకుడు. వెంకట్‌ - డేవిడ్‌ల మధ్య నడిచే ఛేజింగ్‌ ఎపిసోడ్‌లో బలమైన సంఘర్షణ కనిపించదు. ఓ దశలో సినిమా అక్కడక్కడే తిరిగిన అనుభూతి కలుగుతుంది. ఓవైపు జార్జ్‌ కొడుకు హత్య.. మరోవైపు డ్రగ్స్‌ కేసు.. ఈ హీరో మెడకు చుట్టుకున్నప్పటినుంచి కథ రసవత్తరంగా మారుతుంది. ఓవైపు డేవిడ్‌ గ్యాంగ్‌.. మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకొని హీరో తన తండ్రిని ఎలా కాపాడుకుంటాడు.. అతని మెడకు చుట్టుకున్న కేసుల నుంచి ఎలా బయటపడతాడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే హీరో ఆ సమస్యల్ని పరిష్కరించుకునే తీరు ఊహలకు తగ్గట్లుగానే ఉంటుంది. ముఖ్యంగా ఓ రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో సినిమాని ముగించిన తీరు ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించదు.

ఎవరెలా చేశారంటే

క్రికెటర్‌ అవ్వాలనుకునే సగటు మధ్యతరగతి కుర్రాడిగా వెంకట్‌ పాత్రలో కార్తికేయ చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్‌, ఎమోషన్‌ సీన్స్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన ప్రేయసిగా ఐశ్వర్య మేనన్‌ తెరపై అందంగా కనిపించింది. కాకపోతే వాళ్ల ప్రేమకథలో ఫీల్‌ లేదు. ఆమె పాత్ర ద్వితీయార్ధంలో ఓ ఎపిసోడ్‌లో కీలకంగా నిలుస్తుంది. హీరో సోదరుడిగా రాజు పాత్రలో రాహుల్‌ టైసన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తండ్రి పాత్రలో తనికెళ్ల భరణి కనిపించిన తీరు బాగున్నా.. ఆయన ప్రతిభకు తగ్గ బలమైన సన్నివేశాలు పడలేదు. ద్వితీయార్ధంలో ఆయన పాత్రను పూర్తిగా కోమాలో ఉంచేశారు. ప్రతినాయకుడిగా రవిశంకర్‌ తనదైన నటనతో భయపెట్టాడు. శరత్‌ లోహితస్వ, పృథ్వీరాజ్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్‌ ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో తెరపైకి తీసుకురావడంలో తడబడ్డాడు. ముఖ్యంగా ప్రథమార్థం బాగా నెమ్మదిగా సాగిన అనుభూతి కలుగుతుంది. కపిల్‌ కుమార్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఒక్కటీ గుర్తుంచుకునేలా లేవు. ఆర్‌.డి.రాజశేఖర్‌ విజువల్స్‌ మెప్పిస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !