తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినిమాలకు ఓ గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప నటుడు. వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఎంతో మంది అభిమానుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్.. సమాజ శ్రేయస్సు కోసం రాజకీయ నాయకుడిగా ప్రజాపాలన చేసి విజయం సాధించారు. అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటారు అభిమానులు. గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారు.
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు !
మే 28న ఎన్టీఆర్ 101 జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు, తెలుగు దేశం నాయకులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్, నందమురి బాలకృష్ణ కుటుంబసభ్యులు అంతా ఇక్కడే తారక రామారావుకు నివాళులు అర్పిస్తారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెల్లవారుజాము నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తారక్, కళ్యాణ్ రామ్ వచ్చిన సమయంలో వారితో ఫోటోస్ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
‘భారతరత్న’.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్
లెజెండ్ నందమూరి తారక రామారావుకు అత్యున్నత పురస్కారం రావాలని ఆకాక్షించారు మెగాస్టార్ చిరంజీవి. మే 28, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు చిరంజీవి. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను ‘భారతరత్న’ పురస్కారంతో గౌరవించాలని మరోమారు చిరంజీవి ఈ ట్వీట్‌లో పేర్కొనడం విశేషం.
కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024