Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌...కేసీఆర్‌ కనుసన్నల్లోనే !

0

  • చిన్న విమర్శ చేసినా.. ‘పెద్దాయన’కు చిరాకు..!
  • అందుకే నిరసనలు, ఆందోళనలు అణచివేశాం
  • ఆదేశాలన్నీ సీపీ ద్వారా వచ్చేట్టు చూసుకున్నాం
  • వెల్లడిరచిన టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌
  • లోక్‌సభ ఎన్నికల తర్వాత ట్యాపింగ్‌ కేసు పార్ట్‌-2

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ప్రణీత్‌కుమార్‌ అందించే వివరాలతో.. కేసీఆర్‌ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించేవారిని బెదిరించి లొంగదీసుకునేవారమని, సివిల్‌ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్‌ఎస్‌ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. గత నెల 3 నుంచి 10వ తేదీ వరకు దర్యాప్తు అధికారులు రాధాకిషన్‌ను కస్టడీలోకి తీసుకుని, విచారించిన విషయం తెలిసిందే..! ఆ క్రమంలో గత నెల 9వ తేదీన సేకరించిన వాంగ్మూలంలో.. రాధాకిషన్‌ పలుమార్లు అప్పటి సీఎం కేసీఆర్‌ పేరును ప్రస్తావించారు. ‘‘పెద్దాయన(కేసీఆర్‌)కు చిన్న విమర్శ ఎదురైనా చిరాకు పడేవారు. అందుకే.. ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా అణచివేసేవాళ్లం’’ అని వాంగ్మూలంలో రాధాకిషన్‌ పేర్కొన్నారు.

ప్రభాకర్‌రావు ద్వారా టాస్క్‌ఫోర్స్‌కు..

‘‘2017లో నాకు ఎస్పీగా పదోన్నతి లభించింది. తర్వాత నన్ను హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నియమించారు. ఎందుకంటే అప్పటి సీఎం కేసీఆర్‌.. పార్టీ సంబంధిత కార్యకలాపాలను చక్కబెట్టడానికి, హైదరాబాద్‌ను క్రమంగా టీఆర్‌ఎస్‌ అదుపులోకి తెచ్చుకోవడానికి ఒక నమ్మకస్తుడైన అధికారిని నియమించాలనుకున్నారు. సిటీ పోలీసలో డీసీపీ టాస్క్‌ఫోర్స్‌ చాలా కీలకపాత్ర పోషిస్తారు కాబట్టి.. తన సామాజికవర్గానికి చెందిన, నమ్మదగ్గ వ్యక్తిని నియమించుకోవాలని ఆయన భావించారు. తద్వారా వారికి సంబంధించిన రహస్యమైన పనులన్నీ సరిగ్గా చేయించుకోవచ్చని అనుకున్నారు. ఈ క్రమంలోనే టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నా నియామకంలో నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు ప్రధానపాత్ర పోషించారు’’ అని రాధాకిషన్‌ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ పదవిలో ఉండగా ఎవరికీ అనుమానం రాకుండా ఒక పద్ధతి ప్రకారం సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యుల కోసం ఎలా పనిచేసిందీ సవివరంగా తెలిపారు. ‘‘వారికి కావాల్సిందేంటో నేను అర్థం చేసుకుని సిటీ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశాను. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన కొందరి రహస్య కార్యకలాపాలన్నింటినీ చక్కబెట్టేవాడిని. అందులో భాగంగా సివిల్‌ తగాదాల సెటిల్మెంట్లు, టీఆర్‌ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌కు, ఆయన కుటుంబసభ్యులకు ఇబ్బంది కలిగించే వ్యక్తులను బెదిరించడం, లొంగదీసుకోవడం, మా దారికి తీసుకురావడం వంటి పనులు చేసేవాడిని.’’ అని రాధాకిషన్‌ వాంగ్మూలంలో స్పష్టం చేశారు.

2018 ఎన్నికల నుంచే..

తాను టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించాక.. ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్‌ ప్రణీత్‌రావు(2023లో డీఎస్పీగా యాక్సిలరీ పదోన్నతి పొందారు) నేతృత్వంలో స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు తనకు తెలిపినట్లు రాధాకిషన్‌ వివరించారు. ‘‘ప్రతిపక్ష నేతల ఫోన్లపైన, నాటి సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఇబ్బందులు కలిగించే రాజకీయ ప్రత్యర్థులు, వారి సన్నిహితులు, వారి మద్దతుదారులు, వారికి ఆర్థిక సహకారం అందించేవారి ఫోన్లపైన నిఘా పెట్టి ప్రణీత్‌ కుమార్‌ సేకరించిన సమాచారం నాకూ వచ్చేది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. కొన్నికొన్నిసార్లు నేనే అలాంటి సమాచారాన్ని కమిషనర్‌ ద్వారా పంపాల్సిందిగా వారిని కోరేవాడిని. కొన్నిసార్లు మరీ ముఖ్యమైన పనులకు.. మా ప్రణాళిక ప్రకారం సీఎం నుంచిగానీ, ఎస్‌ఐబీ చీఫ్‌ నుంచిగానీ సమాచారం కమిషనర్‌కు వచ్చేది. ఆయన దాన్ని సాధారణంగా నాకు అప్పగించేవారు. నేను కమిషనర్‌ ఆదేశాల మేరకే పనిచేస్తున్నట్టుగా కనిపించేందుకు.. ఇతరులకు ఎలాంటి అనవసరమైన అనుమానాలు రాకుండా ఉండేందుకే అలా చేసేవాళ్లం’’ అని రాధాకిషన్‌ వివరించారు. ప్రతిపక్షాల నగదును స్వాధీనం చేసుకోవడం, అధికార పార్టీ నగదు సరఫరాకు సహకరించడం వంటి రాజకీయ పనులకు సంబంధించిన రహస్య సమాచారం కోసం ప్రణీత్‌ కుమార్‌తో సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభాకర్‌ రావు తనకు మొదట్నుంచీ చెప్పేవారని ఆయన వివరించారు. అలాగే.. కేసీఆర్‌కు, పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రత్యేకమైన పనులను కూడా తనకే అప్పగించేవారని వెల్లడిరచారు. ఆ ఆదేశాల మేరకు తాను ప్రణీత్‌ కుమార్‌తో టచ్‌లో ఉండి, ఎప్పటికప్పుడు తనకు అప్పగించిన పని పూర్తిచేసేవాడినని తెలిపారు. ఈ వ్యవస్థీకృత వ్యవహారం 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే మొదలైందని.. 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు, దుబ్బాక, హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కొనసాగిందని.. అన్నేళ్ల అనుభవంతో 2023 నాటికి తమ పనితీరు అత్యంత సమర్థవంతంగా తయారైందని వెల్లడిరచారు.

కేసీఆర్‌ పూర్తి మద్దతుతో

అప్పటి సీఎం కేసీఆర్‌ పూర్తి మద్దతుతో 2020లో ప్రభాకర్‌ రావు మళ్లీ ఎస్‌ఐబీ చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌గా.. పదవీ విరమణ తర్వాత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమితులైనట్టు రాధాకిషన్‌ పేర్కొన్నారు. ‘‘అడిషనల్‌ ఎస్పీ భుజంగరావుకు ప్రగతిభవన్‌లో సీఎంను కలిసే అవకాశం, ఎలాంటి సమాచారాన్నైనా సీఎంకు అందించే అవకాశం ఉండేది’’ అని పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాత రాజకీయ కోణంలో

ట్యాపింగ్‌ కేసులో లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్ట్‌-2 ఉంటుందని స్పష్టమవుతోంది. గత నెల భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు, రాధాకిషన్‌ల కస్టడీ, విచారణ పూర్తయ్యేసరికి ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. అయితే.. వీరి వాంగ్మూలంలో పలువురు బీఆర్‌ఎస్‌ నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్‌ ఏకంగా తన వాంగ్మూలంలో కేసీఆర్‌ పేరును పదేపదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ కేసు రాజకీయ కోణంలో ముందుకుసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న రాధాకిషన్‌రావు బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఈ సమయంలో బెయిల్‌ మంజూరు చేయవద్దని దర్యాప్తు అధికారుల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దర్యాప్తు అధికారుల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు.. రాధాకిషన్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !