Pune Porsche Crash : బ్లడ్‌ శాంపిల్స్‌ మార్చేసి, రిపోర్ట్‌ని అనుకూలంగా మార్చేసి...

0

  •  కుమారుడి కోసం తండ్రి అడ్డదారులు !
  • పుణె యాక్సిడెంట్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి.
  • వైద్యులకి లంచం ఇచ్చినట్టు పోలీసుల వెల్లడి !

పుణెలో ఓ సంపన్న బాలుడు తప్పతాగి హైస్పీడు కారుతో యాక్సిడెంట్‌ చేసి ఇద్దరు టెకీల ప్రాణాలు తీసిన కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్‌ను తప్పించేందుకు అతని తండ్రి అడ్డదారులు తొక్కుతున్నాడు. కేసులో తమ కుమారుడు చిక్కకుండా ఆ 17 ఏళ్ళ టీనేజర్‌ తండ్రి జిమ్మిక్కులకు పాల్పడుతున్న వైనాన్ని పుణె పోలీసులు తాజాగా బహిర్గతం చేశారు. రక్తంలో ఆల్కహాల్‌ ఆనవాళ్లు తేలకుండా చేసేందుకు ఏకంగా రక్త నమూనా నివేదికను తారుమారు చేశారట. తాజాగా నిందితుడి రక్తనమూనాలు మార్చేసేందుకు డబ్బును ఎలా, ఎంత చేతులు మారాయన్న విషయం  బయటపడిరది. ప్యూన్‌గా పనిచేసే అతుల్‌ ఘట్‌కాంబ్లే ఈ మొత్తం వ్యహారానికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తేలింది. అంతేకాదు.. పోలీసులు వీరిని ముందే అనుమానించి కౌంటర్‌ ఆపరేషన్‌ నిర్వహించగా వైద్యులు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో ఇప్పటికే సాసూన్‌ ఆస్పత్రి వైద్యులు అజయ్‌ తావ్‌రే, శ్రీహరి హల్నోర్‌, అతుల్‌ను  అరెస్టు చేశారు. 

ఏకంగా డాక్టర్ల రక్తనమూనాలే..

ప్రమాదం జరిగిన రోజు డాక్టర్‌ తావ్‌రే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి రక్తనమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేందుకు డీల్‌ కుదిరింది. ఈ నేపథ్యంలో తావ్‌రే తన ప్లాన్‌ కూడా అతడికి వివరించాడు. నిందితుడైన బాలుడి రక్త నమూనాలకు బదులు వేరే డాక్టర్‌ నమూనాలను ఆ స్థానంలో పెడతామని వెల్లడిరచాడు. వైద్య పరీక్షల్లో ఆల్కహాల్‌ ఆనవాళ్లు బయటపడ కూడదనే ఇలా చేశారు. ఈ వ్యవహారంలో డబ్బులు తీసుకొచ్చిన ప్యూన్‌ విచారణ సందర్భంగా ఒక దశలో ఆవేశంతో.. ‘నన్ను ఇరికించారు కదా.. ఎవరినీ వదలను.. అందరినీ లాగుతా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

డాక్టర్‌ శ్రీహరే మార్చేశారు..

ఈ వ్యవహారంపై పుణె పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ  ‘‘ప్రమాదం జరిగిన రోజు ఉదయం 11 గంటలకు సాసూన్‌ ఆస్పత్రిలో బాలుడి రక్త నమూనాలు సేకరించాం. కానీ, అక్కడ వాటిని చెత్తబుట్టలో పారేశారు. మరో వ్యక్తి రక్తం తీసి దానిని పరీక్షలకు పంపారు. హెచ్‌వోడీ తావ్‌రే సూచనల మేరకు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీహరి హల్నోర్‌ ఈ పనిచేసినట్లు తేలింది’’ అని వివరించారు. ఇక ఆ పరీక్షల్లో ఆల్కహాలు ఆనవాళ్లు రాలేదు. 

పోలీసులకు ముందే అనుమానం..

సాసూన్‌ ఆస్పత్రిలో తీసిన బ్లడ్‌ శాంపిల్స్‌లను మార్చేసే అవకాశం ఉందని దర్యాప్తు బృందాలు ముందే అనుమానించాయి. దీంతో నిందితుడైన బాలుడి నుంచి ఆదివారం ఉదయం మరో సారి రహస్యంగా రక్తనమూనాను సేకరించి అంద్‌లోని జిల్లా ఆస్పత్రిలోని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపారు. మే 20వ తేదీన రెండు రక్తనమూనాల స్వాబ్స్‌ను రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. మే 21 బాలుడి తండ్రిని అరెస్టు చేసి అతడి రక్తనమూనాను డీఎన్‌ఏ పరీక్షకు పంపారు. ఈ మూడు పరీక్షల నివేదికలు మే 26న వచ్చాయి. సాసూన్‌ ఆస్పత్రిలో తీసిన రక్త స్వాబ్‌తో బాలుడి తండ్రి డీఎన్‌ఏ సరిపోలలేదు. పోలీసులు రహస్యంగా ఆంధ్‌ ఆస్పత్రికి పంపిన రెండో రక్తనమూనా స్వాబ్‌తో మ్యాచ్‌ అయింది. ఫలితంగ సాసూన్‌ ఆస్పత్రి వైద్యులు అడ్డంగా దొరికిపోయారు. నిందితుడికి తొలుత నిర్వహించిన భౌతిక పరీక్షల అనంతరం వైద్యులపై అనుమానం వచ్చినట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. దీంతోపాటు రక్తనమూనాలు మార్చే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్‌ సమాచారం అందిందన్నారు. డాక్టర్ల తీరుపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ బృందం సాసూన్‌ ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టనుంది. అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !