ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడానికి ఓవైపు హైదరాబాద్ జట్టు సిద్ధమవుతుంటే.. మరోవైపు వరుణుడు తన మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు. గుజరాత్‌తో నేడు జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్‌ను వరుణుడు కొద్దిగా గట్టిగానే పలకరించాడు. ఉదయం నుండి ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అయిన నగరంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా చల్లబడిరది. హైద్రాబాద్ అంతటా ఉరుములు, మెరుపులతో వర్షం దంచి కొడుతోంది. దీంతో ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ మొదలైంది.
మ్యాచ్ రద్దయితే...
ఈ రోజు జరగాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌ను హైదరాబాద్ ఓడిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు దిల్లీతోపాటు లఖ్‌నవూ ఇంటిముఖం పట్టినట్లే. ఇక చివరి స్థానం కోసం చెన్నై - బెంగళూరు పోటీపడాల్సి ఉంటుంది. ఈ రోజు మ్యాచ్ రద్దయి ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తే.. హైదరాబాద్ (15 పాయింట్లతో) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినట్లే. పంజాబ్‌తో జరగాల్సిన ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే టాప్ 2కి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో కోల్‌కతా మీద ఓడిపోతేనే ఇది సాధ్యమవుతుంది. ఇక గుజరాత్ 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి వస్తుంది. ఇక చెన్నై - బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ కూడా రద్దయితే చెన్నై (15 పాయింట్లతో) ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. బెంగళూరు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగి చెన్నై భారీ తేడాతో ఓడితే బెంగళూరు ప్లేఆఫ్స్‌కు వచ్చే అవకాశం ఉంది.