ఎంబీబీఎస్, బీడీఎస్.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాల్లో 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో పాటు నీట్ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడంతో గతవారం కేంద్ర విద్యాశాఖ నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన 1563 విద్యార్థులపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. కమిటీ నిర్ణయాలను కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ‘‘కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది. వారికి మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తాం. జూన్ 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తాం’’ అని ధర్మాసనానికి కేంద్రం వెల్లడిరచింది. ఆ తర్వాతే కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునే వారు.. గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సెలింగ్‌కు వెళ్లొచ్చని పేర్కొంది.
కౌన్సెలింగ్‌పై స్టేకు నిరాకరణ..
ఇక, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. వెబ్ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని చెప్పిన ధర్మాసనం.. ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 మార్కులు కలిపారని అన్నారు.