ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు. శుక్రవారం సాయంత్రం 5గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది.
అనుభవానికి గౌరవం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్నపాత్రుడుకి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెదేపా ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. పదిసార్లు నర్సీపట్నం నుంచి పోటీచేసి ఏడుసార్లు గెలిచారు. ఇప్పటివరకూ ఐదు ప్రభుత్వాల్లో సాంకేతిక విద్య-క్రీడలు, రహదారులు-భవనాలు (రెండు సార్లు), అటవీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవమూ ఆయనకు ఉంది.