ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. మూడురోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.
అక్షరయోధుడు
1936, నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. చిననాటినుంచే విలక్షణ, సృజనాత్మకత కలిగిన ఆయన.. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974, ఆగస్టు 10న విశాఖపట్టణంలో ఈనాడును ప్రారంభించారు. అనంతరం సితార సినీ పత్రిక, ఈటీవీ చానళ్లను కూడా తీసుకొచ్చి మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫిల్మ్ సిటీని నిర్మించారు. సినిమా మొత్తాన్ని అక్కడే షూటింగ్ చేసుకునేలా సకల వసతులు కల్పించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది. రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు.