ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను (JEE Advanced Result) ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఫైనల్ కీతోపాటు కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను Jeeadv.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఐఐటీ ఢల్లీి జోన్‌కు చెందిన వేద్ లహోటి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 360 మార్కులకు గాను 355 మార్కులు స్కోర్ చేశాడు. ఆదిత్య (346), భోగల్‌పల్లి సందేశ్ (338), రిథమ్ కేడియా (337), పుట్టి కుషాల్ కుమార్ (334) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అమ్మాయిల్లో ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేశ్‌కుమార్ 355 మార్కులతో టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నది.
1.91 లక్షల మంది దరఖాస్తు
ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. దాదాపు 40 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రెండు సెషన్లలో కలిపి 14.10 లక్షల మంది జేఈఈ మెయిన్‌కు హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో కటాఫ్ మార్కులతో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యారు. అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, మొత్తం 1.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది నమోదు చేసుకోగా.. ఈసారి ఏకంగా 1.91 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45,965 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించగా, 40,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్ తుది ఫలితాలు ఏప్రిల్ 25న ప్రకటించనుండగా, జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు మే 7 వరకు గడువు ఉంది. ఐఐటీ మద్రాస్ మే 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో పరీక్షను నిర్వహించింది. మే 31న జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష రెస్పాన్స్ షీట్‌లను ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జోసా కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 15న మాక్ సీట్ల కేటాయింపు -1, 17న మాక్ సీట్ల కేటాయింపు -2 ఉంటుంది. 18వ తేదీతో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. 19న వెరిఫికేషన్‌ను చేపడతారు.