- అసాధారణ రీతిలో 67 మందికి టాప్ ర్యాంకు
- ఫలితాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణల వెల్లువ
- కొందరికి 718, 719 మార్కులు రావడంపై అనుమానం
- దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన
- ఫిజిక్స్ ప్రశ్నకు మార్కులు కలపడమే కారణం: ఎన్‌టీఏ
- ఒక్క మార్పుతో 44 మందికి టాప్ ర్యాంక్ అని వివరణ
- అక్రమాలు జరిగాయంటూ కలకత్తా హైకోర్టులో పిటిషన్
- సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి: విపక్షం
- సీబీఐతో దర్యాప్తు.. మళ్లీ పరీక్షకు బీఆర్‌ఎస్వీ డిమాండ్
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఫలితాలపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019 నుంచి ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన వారిలో ఆరుగురు టాపర్లుగా నిలవడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది. ఇప్పటివరకు నీట్ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. 2019, 2020లో ఒక్కొక్కరు చొప్పున టాపర్లుగా నిలిచారు. 2021లో ముగ్గురు, 2022లో ఒక్కరు, 2023లో ఇద్దరు టాప్ స్కోరు సాధించారు. కానీ, ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలవడం, వీరిలో హర్యానాలో ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఆరుగురు ఉన్నారనే వార్తలు రావడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
మార్కులు కలపడం వల్లే టాపర్లు పెరిగారు: ఎన్‌టీఏ
ఎక్కువ మందికి ఇలా అధిక మార్కులు రావడానికి, టాపర్లు కావడానికి ఫిజిక్స్‌లో వచ్చిన ఒక ప్రశ్ననే కారణమని పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చెప్తున్నది. ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నకు.. ఎన్‌సీఈఆర్‌టీ కొత్త టెస్టుబుక్ ప్రకారం ఒక సమాధానం, పాత టెస్టుబుక్ ప్రకారం మరో సమాధానం సరైనవి. మొదట ఒక్క సమాధానానికే ఎన్‌టీఏ మార్కులు ఇస్తూ కీ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు రావడంతో రెండు సరైన సమాధానాల్లో ఏది రాసినా మార్కులు వేసినట్టు ఎన్‌టీఏ వెల్లడిరచింది. ఈ నిర్ణయంతో 44 మంది అభ్యర్థులకు మార్కులు 715 నుంచి 720కి పెరిగినట్టు వివరించింది. ఈసారి పరీక్షా పత్రం సులువుగా ఉండటం, గత ఏడాది కంటే దాదాపుగా మూడు లక్షల మంది ఎక్కువగా పరీక్ష రాయడం కూడా టాపర్లు పెరగడానికి కారణమని పేర్కొన్నది.
కోర్టుకు చేరిన వివాదం
నీట్ ఫలితాల విషయంలో వివాదం కోర్టులకు చేరింది. నీట్ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రేస్ మార్కుల కేటాయింపులో తప్పులు జరిగాయని, ఫలితంగా అభ్యర్థులు అడ్మిషన్లు పొందడంలో నష్టపోతారని న్యాయవాది తన్మయ్ ఛటోపాధ్యాయ్ కోర్టుకు తెలిపారు. దీంతో ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై 10 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్‌టీఏను జస్టిస్ కౌశీక్‌చంద్ర ఆదేశించారు. మరోవైపు రెండు జవాబులు ఉన్న ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేసిన వారికి కూడా మార్కులు కలపాలని కోరుతూ ఓ అభ్యర్థి ఢల్లీి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు జవాబులు సరైనవి కావడంతో ఏ జవాబును రాయకుండా వదిలేశామని, నీట్‌లో ఒక్క మార్కుతోనూ ర్యాంకులో భారీ తేడా వస్తుంది కాబట్టి మార్కులు కలపాలని అభ్యర్థి కోరారు. ఈ పిటిషన్‌పై అభిప్రాయం తెలపాల్సిందిగా ఎన్‌టీఏను వెకేషన్ బెంచ్ జడ్జి జస్టిస్ డీకే శర్మ ఆదేశించారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి
నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో జూదం ఆడుతున్నారని, కచ్చితంగా దీనిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ మరో నేత జైరామ్ రమేశ్ కోరారు. నీట్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ హర్యానాలోని జింద్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హర్యానాలో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురికి టాప్ ర్యాంకులు వచ్చాయని వీరు పేర్కొన్నారు. నీట్ పరీక్ష విధానంలో ఎవరికీ 718, 719 మార్కులు వచ్చే అవకాశం లేదని, కానీ ఫలితాల్లో ఇలా వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ పలువురు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.