దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నీట్‌లో ఎలాంటి అక్రమాలు జరుగలేదని వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా ఒప్పుకొన్నారు. నీట్ అక్రమాలు గుజరాత్, బీహార్‌లో వెలుగుచూడటం.. అక్కడ ఎన్డీయే కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.
గుట్టుగా సాగించి...చివరకు దొరికిపోయి..
మే 5న నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా నిర్వహణ, ఫలితాల వెల్లడి, ర్యాంకుల ప్రకటన విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వ్యవహరించిన తీరు తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉంది. 2019 నుంచి ఎన్నడూలేని విధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి గానూ 720 మార్కులు రావడం అక్రమాలు జరిగాయన్న అనుమానాలకు తొలి బీజాన్ని వేసింది. ఎందుకంటే 2023లో నిర్వహించిన నీట్‌లో ఇద్దరికి మాత్రమే 720 మార్కులు వచ్చాయి. 2022లో ఒక్కరికే వచ్చాయి. 2021లో ముగ్గురికి, 2020, 2019లో ఒక్కొక్కరి చొప్పున 720 మార్కులు సాధించారు. కానీ, ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలిచారు. నీట్ వంటి అత్యున్నత స్థాయి పరీక్షలో ఇంతమందికి ర్యాంకులు రావడం అసాధారణం. కానీ హర్యానాలోని ఒకే సెంటర్‌లో పరీక్షలు రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు రావడం.. అలాగే 180 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష నిర్వహించగా, కొందరికి 719, 718 మార్కులు కూడా వచ్చాయి. ం4, -1 విధానంలో నిర్వహించే నీట్ ఎగ్జామ్‌లో ఇది అసాధ్యం. దీంతో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.
గ్రేస్ మార్కుల వివాదం
కొన్ని పరీక్షా కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో నీట్ పరీక్ష ఆలస్యంగా మొదలైంది. దీంతో 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపినట్టు ఎన్టీఏ వెల్లడిరచింది. గ్రేస్ మార్కులు కలిపిన వారిలో కొందరు టాపర్లు కూడా ఉన్నారు. అయితే, ఏ ప్రాతిపదికన ఈ మార్కులు కలిపారు? దీని కోసం ఏ నిబంధనలను పాటించారు? అని ఎన్టీఏను పలువురు ప్రశ్నించారు. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో వెనక్కి తగ్గిన ఎన్టీఏ తిరిగి ఆ అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని తేలిగ్గా చెప్పింది. తొలుత జూన్ 14న ఫలితాలు ప్రకటిస్తామన్న ఎన్టీఏ 10 రోజుల ముందు అంటే జూన్ 4న రిజల్ట్స్ విడుదల చేసింది. అదేరోజు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రావడం గమనార్హం. అవకతవకలపై నుంచి దృష్టి మళ్లించడానికే ఎన్టీఏ ఇలా చేసిందన్న ఆరోపణలున్నాయి.
మూలాలు అక్కడే
నీట్ పరీక్షలో అవకతవకలకు మూలా లు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఎన్డీయే అధికారంలో ఉన్న బీహార్ రాష్ట్రాల్లోనే వెలుగుచూడటం గమనార్హం. గుజరాత్‌లోని పంచమహ జిల్లా గోద్రా పట్టణంలోని ఓ సెంటర్‌లో ఖాళీ ఓఎమ్మార్ షీట్‌లను ఇచ్చి వెళ్లమని లక్షిత విద్యార్థులకు కొందరు టీచర్లు సూచించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా 27 మంది విద్యార్థులతో వీరికి రూ. 10 లక్షల చొప్పున బేరం కుదిరినట్టు సమాచారం. ఇక, బీహార్‌లో 30 మంది విద్యార్థులకు పరీక్షకు ముందు రోజూ ప్రశ్నాపత్రాన్ని కంఠస్తం చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీని కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ. 30 లక్షల నుంచి రూ. 32 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. కాగా, తొలుత అక్రమాలు జరుగలేదని ఎన్టీఏను వెనకేసుకు వచ్చిన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఆ తర్వాత అక్రమాలు నిజమేనని ఒప్పుకోవడం, ఎన్టీఏలో ఉన్నతాధికారులు దోషులుగా తేలితే చర్యలు తీసుకొంటామని పేర్కొనడం మరింత చర్చకు దారితీస్తున్నది. అక్రమాల సంగతి బయటపడటంతో ప్రభుత్వానికి మచ్చరాకుండా తప్పునంతా ఎన్టీఏ మీదికే నెట్టివేయాలని సర్కారు పెద్దలు కుట్రలకు తెరతీస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఆందోళన
నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలతో పాటు విద్యార్థులు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై నిరసన తెలుపుతూ రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. నీట్ క్వశ్చన్ లీకేజ్‌కు వ్యతిరేకంగా ఆందోలనలు చేపట్టారు. దీంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్టేషన్‌కు తరలించారు. మరోవైపు నీట్ పరీక్షను రద్దు చేయాలని హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ వరకు విద్యార్థులు మార్చ్ నిర్వహించారు. SFI, NSUI, SISF, PDSU, విద్యార్థి జన సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం,AIYI, DYFI, PYL విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లీకేజ్‌తో సంబంధం ఉన్న దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నNEETని రద్దు చేయాలని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.